పర్యాటకురాలిని అడవిలోకి లాక్కెళ్లి, ఆమె స్నేహితుడిని చెట్టుకు కట్టేసి.. ఆపై.. దారుణం
తూర్పు మిడ్నపూర్ జిల్లా దిఘా ప్రాంతంలో ఒక 23 ఏళ్ల పర్యాటకురాలిని ఇద్దరు వ్యక్తులు అడవిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు.

పశ్చిమ బెంగాల్లో దారుణం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో దారుణం చోటు చేసుకున్నది. తూర్పు మిడ్నపూర్ జిల్లా దిఘా ప్రాంతంలో ఒక 23 ఏళ్ల పర్యాటకురాలిని ఇద్దరు వ్యక్తులు అడవిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు. ఆమెతోపాటు ఉన్న ఆమె స్నేహితుడిని చెట్టుకు కట్టేసి.. కొట్టి.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ఇద్దరూ తూర్పు మిడ్నపూర్ జిల్లా మహిసాదల్ నుంచి దిఘా ప్రాంతానికి వచ్చి.. హోటల్ కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో నిందితులు వారికి మాయ మాటలు చెప్పిన ఇద్దరు నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవరి 3వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకున్నది. తక్కువ ధరకే హోటల్ గది ఇప్పిస్తానని ఒక నిందితుడు వారికి నమ్మబలికారు. హోటల్ ఇక్కడికి దూరంగా ఉన్నదని, తమ బైక్‌లపై తీసుకెళతామని చెప్పారు. వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. అనంతరం వారిద్దరిపై దాడి చేసి, వారి దగ్గర ఉన్న ఫోన్లు, పర్సులు, నగలు గుంజుకున్నారు.
ఆమెతోపాటు ఉన్న స్నేహితుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆమెను దుస్తులు తీసేయాలని బలవంతం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను బలవంతంగా అడవిలోకి లాక్కుపోయి, లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన అనంతరం ఇద్దరు బాధితులు స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 376, 379, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని సోమవారం నాడు కాంతి సబ్‌డివిజనల్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించగా.. నిందితులను బాధితులు గుర్తించారు. అనంతరం వీరికి జడ్జి 14 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి సోదరుడు డిమాండ్ చేశాడు. బెంగాల్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంలో ఇంతటి ఘోరం జరగడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ‘నా సోదరి చాలా ధైర్యవంతురాలు. వాళ్లు చేసిన డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేశారు. అడవిలోకి లాక్కు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని చెప్పారు.