మోదీ క్యాబినెట్నుంచి వైదొలగనున్న నరేంద్రసింగ్ తోమర్
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.

- ప్రహ్లాద్‌సింగ్ పటేల్ కూడా రాజీనామా
- మరో 10 మంది ఎంపీలు సైతం
- ఇటీవలి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు
- మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవికి రేసులో నేతలు
న్యూఢిల్లీ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి, విజయం సాధించిన పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు బుధవారం లోక్‌సభకు రాజీనామా చేశారు. బీజేపీ నుంచి 12 మంది ఎంపీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వారంతా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ సహా ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. వీరంతా ఆయా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వాల్లో చేరుతారని విశ్వసనీయంగా తెలుస్తున్నది.
వీరి నుంచే కొత్త నాయకత్వం?
ఈ మూడు రాష్ట్రాల్లోనూ కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్న బీజేపీ ఆలోచనలకు దీన్ని సంకేతంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే.. దీనిపై నోరు విప్పేందుకు సీనియర్ నేతలు ఇష్టపడటం లేదు. పది మంది ఎంపీలు బుధవారం పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో కలిసి వెళ్లి రాజీనామాలు సమర్పించారు. కేంద్రమంత్రులు రేణుకాసింగ్, మహంత్ బాలక్‌నాథ్ కూడా రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సభ్వత్వాలకు రాజీనామా చేసినవారిలో మధ్యప్రదేశ్ నుంచి రాకేశ్‌సింగ్, ఉద్య ప్రతాప్ సింగ్, రితి పాఠక్, రాజస్థాన్ నుంచి కిరోడీలాల్ మీనా, దియా కుమారి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఛత్తీస్‌గఢ్ నుంచి గోమతి సాయి, అరుణ్‌సావో ఉన్నారు కిరోడిలాల్ మీనా ఒక్కరు మాత్రం రాజ్యసభ సభ్యులు. రాజీనామాలు సమర్పించే ముందు తాము ప్రధాని మోదీ ఆశీర్వాదాలు తీసుకున్నట్టు పటేల్ చెప్పారు.
మోదీ మంత్రివర్గ విస్తరణ
కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న నరేంద్ర సింగ్ తోమర్ వంటివారు రాజీనామా చేస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన తోమర్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ నడుస్తున్నది. రాజీనామా చేసిన ఎంపీల్లో ఒకరు రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్‌సింగ్ (71) బదులు.. బీసీ వర్గానికి చెందిన సావోను తెరపైకి తెస్తారన్న చర్చ బలంగా వినిపిస్తున్నది. మూడు రాష్ట్రాల్లో ఇద్దరు బీసీ సీఎంలను నియమించడం ద్వారా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.