చిత్తైన గుజరాత్ జెయింట్స్ .. ఘన విజయం సాధించిన యూపీ వారియర్స్

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ 2024 మంచి రంజుగా సాగుతుంది. అమ్మాయిలు అయిన కూడా అదిరిపోయే ఆటతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నారు. అన్ని టీమ్‌లు గట్టి పోటీ ఇస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టు చివరి వరకు ఫైట్ నడుస్తుంది. అయితే తాజా మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మరో విజయాన్నందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ చేయగా, ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఫోబే లిట్చీఫీల్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), యాష్లే గార్డ్‌నర్(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మంచి ఇన్నింగ్స్ ఆడిన కూడా దానిని భారీ స్కోర్‌గా మలచలేకపోయారు.
యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్‌క్లేస్టోన్(3/20) మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్ ఓ వికెట్ పడగొట్టడంతో గుజరాత్ జెయింట్స్ జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది . ఇక 143 పరుగుల లక్ష్య చేధనకి బరిలోకి దిగిన యూపీ వారియర్స్ సునాయసంగా గెలిచారు. కేవలం 15.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఆ జట్టు 4 వికెట్లకు 143 పరుగులు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ జట్టులో . గ్రేస్ హ్యారీస్(33 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్) హాఫ్ సెంచరీతో అదరహో అనిపించింది. గ్రౌండ్ నలుములలా యధేచ్చగా షాట్స్ ఆడుతూ పరుగులు రాబట్టింది.
ఇక ఆమెతో పాటుగా అలీసా హీలీ(21 బంతుల్లో 7 ఫోర్లతో 33) మెరుపులు మెరిపించింది. కిరణ్ నావ్‌గిర్(12), చమరి ఆటపట్టు(17), శ్వేత సెహ్రావత్(2) పెద్దగా రాణించలేకపోయారు. చివరలో దీప్తి శర్మ(14 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్) కలిసి గ్రేస్ హ్యారీస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. ఇక గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజా కన్వార్ రెండు వికెట్లు తీయగా.. కత్రిన్ బ్రైస్, మేఘనా సింగ్ తలో వికెట్ తీసారు.ఈ ఓటమితో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ పరాజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక యూపీ వారియర్స్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం విశేషం