ఓటరు గుర్తింపు కార్డు.. దాని వెనుకాల ఉన్న చరిత్ర ఇదీ..
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటరు గుర్తింపు కార్డు గుర్తుకు వస్తుంది. ఆ కార్డు ఉంటేనే ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇస్తారు. పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి.

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటరు గుర్తింపు కార్డు గుర్తుకు వస్తుంది. ఆ కార్డు ఉంటేనే ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇస్తారు. పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి. అంతేకాదు.. ఈ ఓటరు గుర్తింపు కార్డు.. వ్యక్తుల చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఇంతటి ప్రాధాన్యత ఓటరు గుర్తింపు కార్డు ఎలా మొదలైంది..? ఏ సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు..? దాని వెనుకాల ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం..
దేశంలోని ఓటర్లందరికీ 1957లోనే ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆలోచన చేసినప్పటికీ అది అమలు కాలేదు. ఓటరు గుర్తింపు కార్డును పూర్తి స్థాయిలో తెచ్చేందుకు మూడు దశాబ్దాల కాలం పట్టింది. 1994 నుంచి ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు.
తొలిసారిగా కోల్‌కతా(సౌత్ – వెస్ట్) పార్లమెంటరీలో..
ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డు జారీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 1960లో చర్యలు చేపట్టింది. కోల్‌కతా(సౌత్ – వెస్ట్) పార్లమెంటరీ నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలో ఓటరు గుర్తింపు కార్డు జారీ చేసేందుకు అక్కడ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. కానీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఆ ప్రయత్నం విఫలమైంది. మళ్లీ 1979 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలైన అసోం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోనూ జారీ చేశారు. దేశ వ్యాప్తంగా 1994లో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేశారు. తెలుపు, నలుపు రంగులో ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 2021లో ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫొటో ఐడీ కార్డుల (EPIC)ను తీసుకొచ్చారు. పీడీఎఫ్‌లో ఉండే ఈ డిజిటల్ కార్డును మార్చేందుకు వీలులేకుండా రూపొందించారు. ప్రస్తుతం ఓటరు గుర్తింపు కార్డును కలర్‌లో జారీ చేస్తున్నారు. దొంగ ఓట్లను నివారించేందుకు ఈ ఓటరు గుర్తింపు కార్డులు ఎంతో దోహదపడుతున్నాయి.