ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? తొలిసారిగా ఎప్పుడు అమలైందంటే..?
దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల కోడ్‌ను ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడ్ ఆఫ్ కండక్ట్) అని కూడా అంటారు.

దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల కోడ్‌ను ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడ్ ఆఫ్ కండక్ట్) అని కూడా అంటారు. ఈ లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? ఈ కోడ్‌ను ఎప్పట్నుంచి అమలు చేస్తున్నారనే విషయాలను తెలుసుకుందాం.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలనే మోడల్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రవర్తన, ఎన్నికల సభ, ర్యాలీ, ఊరేగింపు, రోడ్ షోలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉంటాయి. వీటితో పాటుగా ఓటింగ్ రోజున పార్టీలు, వాటి అభ్యర్థుల ప్రవర్తన, పోలింగ్ బూత్ క్రమశిక్షణ, ఎన్నిక సమయంలో పరిశీలకుల పాత్ర, అధికార పార్టీ పాత్రల గురించి ప్రస్తావించారు.
స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా ఎన్నికల కోడ్ 1960లో మొదలైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్‌ను తొలిసారి అమలు చేశారు. నాడు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే విషయాలను చర్చించి, నిర్ణయించారు. 1962 జనరల్ ఎలక్షన్స్ లో, 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నికల కోడ్‌ను అమలు చేశారు. నాటి నుంచి ప్రతి ఎన్నికలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ అనేది ఏ చట్టంలోనూ భాగం కాదు. అయితే ఎన్నికల కోడ్‌లోని కొన్ని నిబంధనలు, ఐపీసీ సెక్షన్ల ఆధారంగా అమలవుతుంటాయి.
1991 సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విస్తరించారు. అదే ఏడాది, ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేశారు. కానీ, నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలు చేయాలని కేంద్రం భావించింది. ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ విషయంలో స్పష్టత వచ్చింది.
ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలన్న ఎన్నికల సంఘం చర్యకు 1997 మే నెలలో హైకోర్టు సమర్థించింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. చివరకు 2001 ఏప్రిల్ 16న ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన భేటీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి తీసుకురావడానికి అంగీకరించారు.