ఖరీదైన లిప్‌స్టిక్ కొన్నాడని.. పుట్టింటికి వెళ్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు
లిప్‌స్టిక్ పెట్టుకునే మహిళలను చాలా మంది పురుషులు ఇష్టపడుతుంటారు. అయితే ఓ భర్త కూడా తన భార్య కోసం ఖరీదైన లిప్‌స్టిక్ తెచ్చిచ్చాడు. దీంతో భార్య కోపం చేసి.. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

లక్నో : యువతులు, మహిళలు శరీర సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందంగా కనిపించేందుకు చాలా మంది మహిళలు.. రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. ఇందులో ప్రధానమైనది లిప్‌స్టిక్ అని చెప్పొచ్చు. ఇక లిప్‌స్టిక్ పెట్టుకునే మహిళలను చాలా మంది పురుషులు ఇష్టపడుతుంటారు. అయితే ఓ భర్త కూడా తన భార్య కోసం ఖరీదైన లిప్‌స్టిక్ తెచ్చిచ్చాడు. దీంతో భార్య కోపం చేసి.. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం రూ. 30 విలువ చేసే లిప్‌స్టిక్ కొన్నాడు. ఇక సర్‌ప్రైజ్‌గా అది తన భార్యకు ఇచ్చాడు. కానీ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 10 విలువ చేసే లిప్‌స్టిక్ కొనకుండా రూ. 30 లిప్‌స్టిక్ ఎందుకు కొన్నావని మండిపడింది. అది చీప్ అని ఇది కొన్నానని భర్త చెప్పాడు. అయినప్పటికీ భార్య వినిపించుకోకుండా, భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా తన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక ఆ దంపతులను పోలీసులు ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించారు. తన భర్త డబ్బులు వృధా చేస్తున్నాడని, ఖరీదైన లిప్‌స్టిక్ తనకు అవసరం లేదని భార్య తెలిపింది. తమకు రెండేండ్ల క్రితం వివాహమైంది. భవిష్యత్, పుట్టబోయే పిల్లల ఖర్చుల గురించి ఆలోచించకుండా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని ఆమె వాపోయింది. రూ. 30 కంటే తక్కువ ధర ఉన్న లిప్‌స్టిక్ లేకపోవడంతోనే.. అదే కొనాల్సి వచ్చిందని భర్త పేర్కొన్నాడు. ఆ దంపతులకు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు పోలీసులు.