నేడే వరల్డ్ కప్ ఫైనల్.. కప్ కొట్టాలంటే భారత్ ఈ 5 తప్పిదాలు చేయోద్దు..!

వన్డే ప్రపంచకప్ 2023 అసలు సిసలు సమరానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. వరుసగా 10 విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. మొదట్లో అపజయాలు పలకరించిన తర్వాత అనూహ్య విజయాలతో ఫైనల్ చేరిన ఆసీస్‌ని ఢీకొనబోతుంది. రెండు జట్లలో ఏ జట్టు కప్ దక్కించుకుంటుందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా, ఫైనల్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు రానున్నారు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో 2003లో ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ ఓడిపోగా.. ఆసీస్ విజేతగా నిలిచింది. అయితే నేడు జరగనున్న మ్యాచ్‌కి వరుణుడి ముప్పు లేదు. రాత్రి సమయంలో పొగ మంచు కురిసే అవకాశం ఉందని, అయితే దాన్ని ప్రభావం ఆటపై ఏ మాత్రం ఉండకుండా కెమికల్స్ ఉపయోగించనున్నారు. ఇక అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ ఫైనల్ మ్యాచ్‌కు సిద్దం చేసిన పిచ్ పై గడ్డి వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ వికెట్‌పై 315 పరుగులు చేసినా విజయం సాధించవచ్చంటూ క్యూరేటర్ మీడియాకి తెలియజేశాడు. ఇక ఫైనల్ లో భారత్ కఫ్ కొట్టాలంటే ఈ ఐదు తప్పిదాలు చేయవద్దు.
ఫైనల్లో టీమిండియా టాస్ గెలిస్తే సరైన నిర్ణయం తీసుకోవాలి.రెండోది భారత్ బ్యాటింగ్‌కు దిగితే దాటిగా ఆడాలి. ఒకవేళ ముందుగా ఫీల్డింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వార్నర్‌లను వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. మూడోది డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వొద్దు. అలానే క్రీజులో సెట్ అవ్వకుండా వరుసగా వికెట్లు తీస్తూ ఉండాలి. నాలుగవది ముందుగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించాలి. ఐదవది లక్ష్యచేధనకు దిగితే గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలి. అనవసర షాట్స్ ఆడకుండా విజయం వరకు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది.