ఏపీ సీఎంవోకు నేతల తాకిడి
ఐదో జాబితా కసరత్తు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తరలివస్తున్నారు.

- వైసీపీలో కొనసాగుతున్న టికెట్ టెన్షన్
- నాలుగో జాబితాలో ఎస్సీ స్థానాలపైనే దృష్టి
- ఐదో జాబితాలో రాత మారేదెవరికో?
విధాత, అమరావతి: వైసీపీలో నియోజకవర్గ ఇన్ చార్జుల మార్పులు, చేర్పుల జాబితా సాగుతూనే ఉంది. ఇప్పటికే వరుసగా నాలుగు జాబితాలు ప్రకటించిన సీఎం జగన్… మరిన్ని కీలక నియోజకవర్గాలు, అసమ్మతి నేతల స్థానాలపై కసరత్తును కొసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో త్వరలో ఐదో జాబితా వెలువడనుంది. ఇప్పటివరకు ప్రకటించిన జాబితాల్లో దాదాపు 20 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు అధిష్టానం సీట్లు నిరాకరించింది. 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ స్థానాలనూ మార్చింది. ఐదు సిటింగ్ స్థానాల్లో జడ్పీటీసీలకు అవకాశం కల్పించారు. గురువారం రాత్రి విడుదలైన వైసీపీ నాలుగో జాబితాలో ఎస్సీ స్థానాలపైనే అధిష్టానం దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా చిత్తూరు ఎంపీ స్థానం నుంచి ఎన్ రెడ్డెప్పను తప్పించి కే నారాయణ స్వామిని నియమించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే స్థానం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కే నారాయణ స్వామిని తప్పించి ఎన్ రెడ్డెప్పకు అవకాశం ఇచ్చారు. ఇరువురూ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు మారాల్సి వచ్చింది. శింగనమల నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి టికెట్ చేజార్చుకుంది. ఆమె స్థానంలో ఎం వీరాంజనేయులును నియమిస్తూ అధిష్టానం నిర్ణయించింది. నందికొట్కూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ను దూరం పెట్టి, డాక్టర్ దారా సుధీర్ కు అవకాశమిచ్చారు. తిరువూరు నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధిని కాదని, నల్లగట్ల స్వామిదాసును ఎంపిక చేశారు. మడకశిర స్థానం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్థానంలో ఈత లక్కప్పకు చాన్స్ ఇచ్చారు. కొవ్వూరులో తానేటి వనితను తప్పించి, తలారి వెంకట్రావుకు, గోపాలపురంలో తలారి వెంకట్రావును తప్పించి తానేటి వనితకు మార్పులు చేశారు. ఇక్కడ ఇరువురి స్థానాల్లో మార్పులు చేశారు. కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ను తప్పించి, దద్దాల నారాయణ యాదవ్ పేరును ఖరారు చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్ సభ స్థానానికి ఈ జాబితాలో మార్పులు చేశారు.
ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు
ఐదో జాబితా కసరత్తు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తరలివస్తున్నారు. శుక్రవారం సీఎంవోకు పలువురు నేతలు క్యూకట్టారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్, కే శ్రీనివాసులు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదీప్ రాజ్, సింహాద్రి రమేష్, అనంత వెంకటరామిరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎస్ కోట ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావులు సీఎంవోకు వచ్చారు. టికెట్ల కేటాయింపుపై అధినేతతో పాటు పార్టీ సీనియర్లతో చర్చించినట్లు సమాచారం.
బూతులు తిట్టలేదనే..
లోకేశ్, పవన్ ను బూతులు తిట్టకపోవడమే తన అనర్హతకు కారణమని, వైసీపీలో ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టే వారికే పదవులు, సీట్లు ఇస్తారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన టికెట్ కేటాయించకుండా సీఎం జగన్ తనకు అన్యాయం చేశారని వాపోయారు. వైసీపీకి చెందిన ఓ ఎంపీతో సీఎం జగన్ లోపాయికారి ఒప్పందంతోనే తనను దూరం పెట్టినట్లు పేర్కొన్నారు. తనకు మంత్రి ఇస్తానని జగన్ మాటతప్పారనీ అన్నారు. త్వరలోనే అనుచరులతో సమావేశమై భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని రక్షణ నిధి చెప్పారు.
జనసేన వైపు.. బాలశౌరి చూపు
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలో తనకు గుర్తింపు లభించడం లేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్ తో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. ఈక్రమంలో పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన… శుక్రవారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. జనసేనలో చేరికపై చర్చించినట్లు ఈసందర్భంగా ఇరువురూ సమాచారం. కాగా బాలశౌరి బందరు నుంచి బరిలోకి దిగుతారా? సొంతూరు గుంటూరుపై గురిపెట్టారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
టీడీపీ గూటికి వాసంశెట్టి..
అమలాపురానికి చెందిన వైసీపీ యువజన విభాగం నాయకుడు, శెట్టి బలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ టీడీపీలో చేరనున్నారు. శనివారం 5 వేల మందితో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రి విశ్వరూప్, స్థానిక పార్టీ నేతల ఇబ్బందులతోనే తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. వాసంశెట్టి రాజీనామాతో కోనసీమ జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది.
కోవూరులో అన్నదమ్ముల రచ్చ
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీలో అన్నదమ్ముల విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అసెంబ్లీ సిటింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై సోదరుడే తిరుగుబాటు చేశారు. నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపాయి. తన సోదరుడు ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన సీఎం జగన్ ను కోరడం సంచలనం రేపింది. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వెంకటరమణయ్య అంతా తానై వ్యవహరిస్తూ, తనతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టారని వాపోయారు. ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేస్తున్నాడంటూ నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి ఆడియో వైరల్ గా మారింది. సొంత సోదరుడినే నియంత్రించలేని ఎమ్మెల్యే… నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఎలా దారికి తెచ్చుకుని విజయం సాధిస్తారన్న చర్చ జరుగుతోంది.