మగువలకు షాక్ ఇచ్చిన బంగారం..! పది రోజుల్లోనే దాదాపు రూ.3వేల వరకు పెరుగుదల..!

విధాత: దసరా పండగకు ముందు బంగారం ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతున్న ధరలు ఆదివారం సైతం పెరిగాయి. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.200 పెరిగి తులానికి రూ.56,500 చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరగడంతో తులం రూ.61,750 పలుకుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,750కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,850కి పెరిగింది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,750కి ఎగిసింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,750కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,600 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. రూ.1200 పెరిగి కిలోకు రూ.75,300కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.78,700 పలుకుతున్నది.
పది రోజుల్లో 3వేల వరకు పెరుగుదల..
భారతదేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. పండగలు, శుభాకార్యాల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, గత పదిరోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి ముహూర్తాలు సైతం దగ్గరపడుతుండడంతో కొనుగోళ్లు మరింత జరుగనున్న నేపథ్యంలో ధరల పెరుగుదల అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. అయితే, ప్రభుత్వ బాండ్ల విలువ పడిపోతున్నది.
అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్లు పెంచక తప్పదని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. దాంతో డాలర్ విలువ పతనమైంది. దాంతో చాలా మంది ఇన్వెస్లర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు పాలస్తీనా హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సైతం పుత్తడి, వెండి ధర పెరుగుదలకు కారణమైంది.
ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం రూ.62వేల మార్క్‌ను సైతం దాటేస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 12న 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,910 ఉండగా.. దాదాపు పది రోజుల్లోనే రూ.61,750కి చేరింది. అంటే దాదాపు రూ.3వేల వరకు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సైతం రూ.4వేలకుపైగా పెరుగుదల నమోదైంది.