GST 2.0 | సెప్టెంబర్ 22 నుంచి 5% మరియు 18% జిఎస్​టీ మాత్రమే : కేంద్రం చారిత్రక నిర్ణయం

భారత్‌లో జీఎస్టీ కౌన్సిల్ భారీ సంస్కరణలు ప్రకటించింది. ఇకపై 5% మరియు 18% GST స్లాబ్‌లు మాత్రమే. లగ్జరీ వస్తువులు, సిగరెట్లు, గుట్కా, టోబాకో ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40% పన్ను విధించబడనుంది.

GST 2.0 | సెప్టెంబర్ 22 నుంచి 5% మరియు 18% జిఎస్​టీ మాత్రమే : కేంద్రం చారిత్రక నిర్ణయం

న్యూ ఢిల్లీ:

GST 2.0 | దేశంలో వస్తు-సేవల పన్ను (GST) విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. 2017లో అమల్లోకి వచ్చిన GST నాలుగు స్లాబుల వ్యవస్థ (5%, 12%, 18%, 28%) కారణంగా చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజలు పన్ను వ్యవస్థతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు – 5% మరియు 18% మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస మరియు ‘పాపపు వస్తువుల(Luxury & Sin goods)పై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది.

"These reforms have a multi-sectoral and multi-thematic focus, aimed at ensuring ease of living for all citizens and ease of doing business for all," Union Finance Minister Nirmala Sitharaman

🏷️ కొత్త GST వ్యవస్థ – ప్రజలకు ఉపశమనం

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ-క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు.

  • నిత్యావసర వస్తువులు – పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, సబ్బులు, షాంపూలు, టాయిలెట్రీస్ – 5% స్లాబ్‌లోకి వస్తాయి.
  • టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లు, చిన్న కార్లు (పెట్రోల్ 1200cc వరకు, డీజిల్ 1500cc వరకు), 350cc లోపు బైకులు – 18% స్లాబ్‌లోకి వస్తాయి.

🚬 ప్రత్యేక 40% స్లాబ్ – పాపపు, విలాస వస్తువులు( Sin & Luxury goods)

సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ బెవరేజెస్, పెద్ద కార్లు, 350cc పైగా బైకులు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాట్స్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు.
ఇంతకుముందు వీటిపై 28% + సెస్ అమలులో ఉండేది. కొత్త విధానం ద్వారా దీన్ని ఒకే 40% slab లోకి తీసుకొచ్చారు.

🚜 రైతులకు ఊరట, విద్యకు ప్రోత్సాహం

  • రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు.
  • విద్యా రంగానికి కూడా ఊరట – నోట్‌బుక్స్, ఎరేసర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామగ్రిపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు.

📊 పాత వ్యవస్థ ఎందుకు రద్దు?

ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబుల వ్యవస్థలో:

  • 18% స్లాబ్‌లోనే 67% రెవెన్యూ వస్తోంది.
  • 12% స్లాబ్ ద్వారా కేవలం 5% ఆదాయం మాత్రమే వచ్చింది.
  • 5% మరియు 28% స్లాబుల ద్వారా వరుసగా 7% మరియు 11% రెవెన్యూ లభించింది.
    దీంతో 12% స్లాబ్ పెద్దగా ఉపయోగం లేకపోవడంతో రద్దు చేశారు. 28% స్లాబ్‌ను తొలగించి తయారీదారులను ధరలు తగ్గించేలా ప్రోత్సహించేందుకు 18%లో కలిపేసారు.

🗣️ ప్రధాని మోడీ స్పందన

ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ (Twitter)లో స్పందిస్తూ –
“స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో నేను చెప్పినట్లుగానే, నవతరపు జిఎస్​టీ సంస్కరణలు (Next Generation GST Reforms) ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇది ప్రజలకు జీవన సౌలభ్యం, వ్యాపారులకు సులభతర వాణిజ్య సౌకర్యాలు కలిగిస్తాయి. రైతులు, మహిళలు, యువత, మధ్య తరగతి వారు మాత్రమే కాకుండా, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు అందరికీ ఉపయోగకరంగా నిలుస్తాయి,” అని పేర్కొన్నారు.

🏦 ఆర్థిక ప్రభావం

ఈ సంస్కరణల వల్ల ప్రభుత్వానికి దాదాపు ₹48,000 కోట్ల వరకు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా. కానీ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగలడం ద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

జీఎస్టీ సంస్కరణలు 2025 ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. సాధారణ వస్తువులు చౌక అవుతాయి. లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం కఠిన పన్నులు అమలవుతాయి.