Bheems Ceciroleo | బప్పిలహిరిని మళ్లీ భువికి రప్పించిన భీమ్స్
మన శంకరవరప్రసాద్ గారు టైటిల్ గ్లింప్స్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఈతరం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అలనాటి చిరంజీవి సూపర్‌హిట్ చిత్రంలోని పాపులర్ మ్యూజిక్ బిట్‌ను ఇప్పుడు మళ్లీ కొత్తగా వినిపించాడు.

రౌడీ అల్లుడు.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 1991లో విడుదలైన చిత్రం. శోభన, అప్పటి సెన్సేషనల్ హీరోయిన్ దివ్యభారతి నాయికలుగా నటించగా, హిందీ డిస్కో మాస్టర్ బప్పిలహిరి సంగీత దర్శకత్వం వహించిన సినిమా. చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా చిరంజీవి మాస్ చిత్ర చరిత్రలో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌డూపర్ హిట్. అందులోని లవ్ మీ మై హీరో.. అనే పాట మొదలయ్యే మ్యూజిక్ బిట్టే మన శంకరవరప్రసాద్ గారులో బిజిఎంగా కొత్తగా అవతరించింది. భీమ్స్ ఆ సంగీతపు హుషారును తగ్గించకుండా, అద్భుతంగా ఆధునీకరించాడు.
రౌడీ అల్లుడుకి ముందు బప్పిలహిరి చిరంజీవి సినిమాల్లో రెండింటికి మ్యూజిక్ ఇచ్చాడు. అవి స్టేట్ రౌడీ ఇంకా గ్యాంగ్‌లీడర్. గమ్మత్తేమిటంటే, గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు వరుస చిత్రాలు. గ్యాంగ్‌లీడర్‌కు చరిత్ర తిరగరాసే సంగీతం ఇచ్చిన బప్పీ, రౌడీ అల్లుడుకి కూడా అదే స్థాయిలో ఇచ్చి, అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఈ మూడు చిత్రాలు కూడా మ్యూజికల్‌గా, కమర్షియల్‌గా ఘనవిజయం సాధించి చిరంజీవికి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టగా, ఆ వెంటనే వచ్చిన ఘరానా మొగుడు, తెలుగు చలనచిత్ర చరిత్ర రికార్డులను తిరగరాసి, బిగ్గర్ దేన్ బచ్చన్ అనేలా చేసింది. మెగాస్టార్ స్థానాన్ని శాశ్వతం చేసింది.
దాదాపు పాతిక తెలుగు చిత్రాలకు సంగీతం అందించిన బప్పిలహిరి, బీట్స్ విషయంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. చిరంజీవికే కాకుండా బాలకృష్ణ, మోహన్‌బాబు సినిమాలకు కూడా హిట్ మ్యూజిక్ ఇచ్చిన బప్పిలహిరిని మన శంకరవరప్రసాద్ గారు టైటిల్ సందర్భంగా బీజీఎంగా ఇచ్చారంటే, దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత పెద్ద చిరంజీవి అభిమానో అర్థం చేసుకోవచ్చు.
రౌడీ అల్లుడులోని ఆ మ్యూజిక్ బిట్ నిజంగా అప్పట్లో మ్యాజిక్ చేసింది. పాట మొదలవడానికి ముందు మొదలయ్యే ఆ బీట్ పాటంతా సాగుతుంటుంది. ఒకచోట ఇదే బిట్‌ను దాదాపు 100 సెకన్లపాటు వివిధ రకాల వాయిద్యాలతో కంటిన్యువస్‌గా వినిపించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాడు బప్పి. అప్పట్లో ఈ బిట్ పెద్ద హిట్. ఒక్కసారిగా ఈ గ్లింప్స్‌లో ఆ బిట్ కొత్తగా వినిపించేసరికి అభిమానులు వెర్రెత్తిపోయారు. ఆ అభిమానుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరని హ్యాపీగా చెప్పొచ్చు. ఈ తరం ప్రేక్షకులకు అప్పటి ఆ పాట ఎలా ఉందో, బప్పిలహిరి మ్యూజిక్ మ్యాజిక్ ఏం మాయ చేసిందో పరిచయం చేద్దాం.
రౌడీ అల్లుడులోని లవ్ మీ మై హీరో.. పాటను ఈ కింది యూట్యూబ్ లింక్‌లో చూడండి.