Indian Cinema | ఇకనుంచీ టాలీవుడ్​ కాదు…​ ఇండీవుడ్​​..!

నిన్న బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​.. నేడు కల్కి 2898 ఏడి. అప్పుడెప్పుడో ‘మాయాబజార్’​లో మార్కస్​ బార్ట్​లే(Marcus Bartley) మాయాజాలం ఆబాలగోపాలాన్ని అబ్బురపరిస్తే, ఇప్పుడు ‘కల్కి 2898AD’ అద్భుతమైన కథతో,  కళ్లుచెదిరే విఎఫ్​ఎక్స్​తో అదిరిపోతోంది.

  • Publish Date - July 1, 2024 / 08:23 AM IST

మార్కస్​ బార్ట్​లే గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు. గ్రాఫిక్స్​ మాయాజాలం భారత్​లో బాగా పాపులర్​ అయింది, 1987లో విడుదైన హిందీ సినిమా ‘మిస్టర్​ ఇండియా’తో. అనిల్​కపూర్​, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో హీరో అదృశ్యంగా ఉంటాడు. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక తెలుగు సినిమా విషయానికొస్తే, ఆదిత్య 369(1991) మొదటి సైన్స్​ ఫిక్షన్​ సినిమా. ఇందులోని టైమ్​మెషీన్​లో తెలుగువారందరూ ప్రయాణించారు.  ‘అమ్మోరు’ (1995) సినిమా గ్రాఫిక్స్​ మాయాజాలంలో తెలుగు జనాలు పూర్తిగా మైమరిచిపోయారు. అయితే ఇవే మొదటి విఎఫ్​ఎక్స్​(VFX – Visual Effects) సినిమాలు కాకపోయినా, ప్రజల దృష్టిని మళ్లించిన సినిమాలు మాత్రం ఇవే. వీటిలో గొప్పదనమేమిటంటే, స్పెషల్​ ఎఫెక్ట్స్​ కథలో భాగంగా, కథను ఎలివేట్​ చేయడానికి మాత్రమే వాడారు. అందుకే అవి అంత సూపర్​హిట్ అయ్యాయి. కంప్యూటర్​ గ్రాఫిక్స్​ లేనప్పుడే, విఠలాచార్య సినిమాల్లోని దయ్యాలు, పౌరాణిక చిత్రాలలోని యుద్ధ దృశ్యాలు చిత్రీకరించడానికి అప్పటి సినిమాటోగ్రాఫర్లు ఎంత కష్టపడ్డారో ఇప్పుడెవరికీ అర్థం కాదు.

గ్రాఫిక్స్​ బాగా ఫేమస్​ అయ్యాక, కేవలం విఎఫ్​ఎక్స్​ కోసమే కథను రాసుకుని తీసిన సినిమాలున్నాయి. అవన్నీ అట్టర్​ఫ్లాప్​. కారణం, కథలో బలం లేకపోవడం, గ్రాఫిక్స్​ చుట్టే సినిమా అంతా తిరగడం.

ఇక ఇంగ్లీష్​ సినిమాలకొస్తే, అక్కడి దిగ్దర్శకులు జేమ్స్​ కామెరూన్(James Cameron)​, స్టీవెన్​ స్పీల్​బర్గ్(Stecen Spielberg)​, జార్జ్​ లూకాస్(George Lucas)​, స్టీఫెన్​ సోమర్స్(Stephen Sommers)​, రోనాల్డ్​ ఎమ్​రిచ్(Ronald Emmerich)​, క్రిస్టఫర్​ నోలన్(Christopher Nolan)​ అద్భుతమైన సినిమాలు తీసారు. వారు తీసిన సినిమాలన్నీ దాదాపుగా ఆస్కార్​కు నామినేట్ అయ్యాయి, గెలిచాయి కూడా. వాటిలో ప్రముఖమైనవి స్టార్​వార్స్​, టైటానిక్​, అవతార్​, ఇండిపెండెన్స్​ డే, జురాసిక్​ పార్క్​, టెనెట్​..ఇలా ఇవన్నీ బలమైన కథను నమ్ముకుని తీసిన సినిమాలు. టైట్​ స్క్రీన్​ప్లే, పాత్రకు సరిపోయే నటీనటులు, వాటికి అదనపు బలంగా విఎఫ్​ఎక్స్​.. అంతే. ఇదీ విజయసూత్రం.

సరిగ్గా దాన్ని వంటబట్టించుకున్నవారిలో మొదటి దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి(SS Rajamouli). తమిళ దర్శకుడు శంకర్​(Shankar Shanmugam) కూడా గ్రాఫిక్స్​ మీద అమితాసక్తి ఉన్నవాడే. అతను తీసిన రోబో(Robot) సూపర్​బంపర్​ హిట్​. కారణం, మళ్లీ మంచి కథ. దానికి  సరిపోయిన విఎఫ్​ఎక్స్​. తర్వాత ఆయన ఐ, రోబో2 లాంటివి తీసి ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. కారణం బలమైన కథ లేకపోవడం. సరిగ్గా ఈ సమయంలోనే రాజమౌళి తన ప్రతిభను వెలికితీసాడు. మగధీర()తో సంచలనం సృష్టించాడు. బాహుబలి1, 2(Bahubali-1,2) లతో దేశాన్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు. ఆయన విజయసూత్రం కూడా అంతే.. కథ ముందు ‌‌– గ్రాఫిక్స్ తర్వాత(Story First – Graphics Next). ఇక ‘ఆర్​ఆర్​ఆర్’​ను​ చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. దర్శకుడి ఆలోచనను, ఆయన తన మనసులో చేసుకున్న విజవలైజేషన్(Visualisation)​ను ఉన్నదున్నట్లుగా తెరపైకి తీసుకురావడం విఎఫ్​ఎక్స్​ స్టుడియోల(VFX Studio) పని. దానికి కూడా దర్శకుడు పక్కనే ఉండాలి. నెలలకు నెలలు గడపాలి. తనకు నచ్చినవిధంగా అవుట్​పుట్​ వచ్చింతర్వాత ఆ సినిమా బయటకొస్తుంది.

రాజమౌళి సినిమాలంటే మినిమం మూడేళ్లంటే.. ఇందుకే మరి. షూటింగ్​తో పెద్దగా ఇబ్బంది లేదు. గ్రీన్​ మ్యాట్​, బ్లూ మ్యాట్​ వేసి తొందరగా తీసేస్తారు. ఆ తరువాతే అసలు పని మొదలవుతుంది. అదే సినిమా ఆలస్యానికి కారణం. అప్పటికీ సినిమాను పార్టులుగా విడగొట్టి, పది, పదిహేను విఎఫ్​ఎక్స్​ స్టుడియోలకిస్తారు. వాటికింద వందల మంది గ్రాఫిక్​ డిజైనర్లు(Graphic Designers)  పనిచేస్తారు. వాటన్నింటినీ క్రోడీకరించి, సరిగ్గా లేనివాటిని, మళ్లీ చేసి తుది రూపం తీసుకురావడానికి ఇన్నేళ్లు పడుతుంది. నిజానికి ఫాంటసీ, చారిత్రక, పౌరాణిక, సై–ఫై సినిమాలకే గ్రాఫిక్స్​ వాడుతున్నారనుకుంటే పొరపాటు. సాంఘిక చిత్రాలు(Social Movies)  కూడా విరివిగా వాడుతున్నాయి. పుష్ప(Pushpa), ఉప్పెన లాంటి సినిమాలు కూడా వాడాయి. ఇప్పుడు దాదాపు ప్రతీ సినిమా విఎఫ్​ఎక్స్​ లేకుండా రావడంలేదు. అత్యంత సహజంగా, పూర్తి నిజమని  భ్రమించే విధంగా ఇప్పటి విఎఫ్​ఎక్స్​ ఉంటున్నాయి. ఈ క్రెడిట్​ అంతా దర్శకుడికే దక్కుతుంది. ఆర్​ఆర్​ఆర్(RRR)​తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్కార్​ అవార్డు గెల్చుకున్నాడు. తన అభిమాన దర్శకులను కలుసుకున్నాడు. హాలీవుడ్​ ప్రముఖ దర్శకులు ఎంతో మెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు.

 

ఇప్పుడు ఇక కల్కి 2898 ఏడీ(KALKI 2898AD) వంతు. భారత ఇతిహాసాన్ని ముడిపెట్టి, ఒక ఫ్యూచరిస్టిక్(Futuristic)​ కథ రాసుకోవడంలోనే దర్శకుడు నాగ్​ అశ్విన్(Nag Ashwin)​ ప్రతిభ తెలిసిపోయింది. దాన్ని అంతే శ్రద్ధతో, తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ సినిమాతో మూడేళ్లు ‘చెప్పులరిగేలా’  ప్రయాణించి, మనసా, వాచా, కర్మణా చేసే పని మీదే ఏకాగ్రత కనబరిచి తను చూపించాలనుకున్నది సరిగ్గా చూపించగలిగాడు. ప్రపంచం దద్దరిల్లేలా విజయ ఢంకా మోగించాడు. ముందు మనం అనుకున్న ఆంగ్ల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా, మరో ప్రపంచాన్ని అద్భుతరీతిలో ఆవిష్కరించాడు. ఎవరు ఏ పాత్ర ధరించాలనేది పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాకే నటీనటులను ఎన్నుకున్నాడు. అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan)​, దీపికా పడుకొనే(Deepika Padukone), కమల్​ హాసన్​(Kamal Haasan)లను కథ పూర్తిగా రెడీ అయ్యకే ఎంపిక చేసాడు. ఒక్క ప్రభాస్​(Prabhas)  మాత్రమే సింగిల్​ లైన్​ స్టోరీలో హీరో. అదీ.. ఈ సినిమా గొప్పదనం.

ఎవరి ఊహలకూ అందకుండా, కథను రాసుకుని, ఫలానా పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారని తెలిసినా, ఎవరేమిటీ అనేది తెలియకుండా షూటింగ్​ చేసాడు. అశ్వత్థామ(Ashwathhama)గా అమితాబ్​ నటిస్తున్నాడగానే సంచలనం మొదలైంది. అసలు అశ్వత్థామ అంటేనే ఎవరికీ తెలియదు. అక్కడే నాగ్​ మొదటి సక్సెస్​ ప్రారంభమయింది. ఇక కథను ఊహించడం అసాధ్యం. చాలారోజులు టైమ్​ ట్రావెల్(Time Travel)​ మీద సినిమా అనుకున్నారు. కారణం ‘ఆదిత్య369’  తీసిన సింగీతం శ్రీనివాసరావు మెంటార్​గా ఉండటమే. ఇవన్నీ వింటూ, తనపని తను చేసుకుంటూ వెళ్లిపోయాడు నాగ్​. కథను రాసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. మహాభారతాన్ని(Maha Bharatha) ఆమూలాగ్రం పది పదిహేను సార్లు చదివాడట. పౌరాణిక విషయాలపై పట్టున్న ఆధ్యాత్మికవేత్తలతో, ప్రవచనకర్తలతో గంటలకొద్దీ చర్చలు జరిపాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించడానికి ఫ్యూచరిస్టులూ, శాస్త్రవేత్తల సహాయం తీసుకున్నాడు. హీరోకు ఒక ఏఐ కారు కావాలని ఆనంద్​ మహింద్రాను రిక్వెస్ట్​ చేసాడు. బుజ్జి(Bujji) అలా పుట్టిందే.  ఇది మామూలు కష్టం కాదు. చరిత్రలో కలకాలం నిలిచిపోవాలంటే ఇలాంటి కష్టమే కావాలి. హాలివుడ్​(Hollywood)నే తలదన్నేలా భారతీయ కథ(Indian Mythological Story)తో చిత్రం తీసి దేశం పేరును నలుదిక్కులూ పిక్కటిల్లేలా మారుమ్రోగించాడు. ఇది కదా విజయమంటే. ఇప్పుడు ఏంటి ఇక? మనకూ ఓ కామెరాన్​, ఓ స్పీల్​బర్గ్​ ఉన్నారు. మనమూ ఇక ఎంతమాత్రం టాలీవుడ్​ కాదు., ఇండీవుడ్(Indywood)​. ఏ భారత భాషలోనైనా తీసి ఏ భాషలోనైనా విడుదల గలిగే ఇండీవుడ్​. అసాధారణ సాధికారత మన యువ దర్శకుల సొంతం. హాలీవుడ్​ వేల కోట్ల ఖర్చుతో తీసే సినిమాలు, అంతే నాణ్యతతో అందులో పదిశాతం ఖర్చుతో తీయగలుగుతున్నారు. ఇంకేం కావాలి? ఇంకా సంతోషించే విషయమేమిటంటే, మన దర్శకుల మధ్య మంచి సంబంధాలు ఉండటం. సహాయసహకారాలు అందించడం. రాజమౌళి కల్కి విషయంలో ఎంత సహకరించాడో నాగ్​ అశ్విన్​కే తెలుసు. నాకు పోటీ.. నేనెందుకు హెల్ప్​ చేయాలని రాజమౌళి అనుకోలేదు. మన తెలుగు సినిమా అనుకున్నాడు. అంతే… తమిళ దర్శకుడు శంకర్​లో ఈ మంచి గుణమే లోపించింది. బాహుబలికి అంత పేరు రావడం అతను జీర్ణించుకోలేకపోయాడు. ఒకానొక సమయంలో కామెంట్ కూడా చేసాడు. కానీ, పరిణితి చెందిన మనవాడు అది పెద్దగా పట్టించుకోలేదు. తన తెలుగు సినిమా ప్రారంభోత్సవానికి కూడా వచ్చాడు.

ఈ విజయ ప్రయాణం ఇలాగే సాగాలి. కథనే నమ్ముకోవాలి, భావోద్వేగాలు పండాలి. నాయకుడు బలంగా, ఆదర్శవంతంగా ఉండాలి. ఆ తర్వాతే నటీనటులూ, విఎఫ్​ఎక్స్​లూ.. భారతదేశంలో ఒక మూల తయారవుతున్న తెలుగు సినిమా()లు, ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఇంగ్లీష్ చిత్రాల()కు సమ ఉజ్జీలుగా నిలబడుతున్నాయంటే ఇంతకంటే మనకు గర్వకారణమేముంటుంది? మన భారత ఇతిహాసాలు, పురాణాల నుండి గొప్ప కథలను పుట్టించొచ్చు అని నమ్మిన ఇద్దరు దర్శకులూ విజయవంతమయ్యారు. తీయాలంటే ఇంకా వందల సినిమాలకు సరిపడా విషయముంది భారత్​లో. ప్రపంచం కళ్లు తెరవకముందే విజ్ఞానం విలసిల్లిన దేశం మనది. తీసుకున్నవాళ్లకు తీసుకున్నంత. ఇంక దర్శకులదే ఆలస్యం.

సాహో నాగ్​ అశ్విన్​… కల్కి రెండో భాగం కోసం ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

 

 

Latest News