Sandalwood । ఇక శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు? కేరళ తరహాలో కమిటీ ఏర్పాటుకు సినీ పెద్దల వ్యతిరేకత

లైంగిక వేధింపుల నిరోధానికి శాండల్‌వుడ్‌లో కమిటీని వేస్తే.. బిజినెస్‌ దెబ్బతింటుందని కన్నడ సినీ రంగ పెద్దలు చెబుతున్నారు. అసలు శాండల్‌వుడ్‌లో మహిళలపై వేధింపులే లేవని, కాస్టింగ్‌ కౌచ్‌ అనేది లేనే లేదని వాదిస్తున్నారు.

Sandalwood । ఇక శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు? కేరళ తరహాలో కమిటీ ఏర్పాటుకు సినీ పెద్దల వ్యతిరేకత

Sandalwood । మాలీవుడ్‌లో మహిళల పట్ల అకృత్యాలు, లైంగిక దాడుల అంశాలపై జస్టిస్‌ హేమ కమిటీ (Justice Hema Committee) ఇచ్చిన నివేదికతో కేరళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో శాండల్‌వుడ్‌ (Sandalwood) నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాండల్‌వుడ్‌ (చందనవన) లో మహిళల స్థితిగతులపై పరిశీలించేందుకు జస్టిస్‌ హేమ కమిటీ తరహాలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని బెంగళూరు కేంద్రంగా పనిచేసే సినీ పరిశ్రమ గ్రూపు ‘ఫైర్‌’ (ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఫర్‌ రైట్స్‌ అండ్‌ ఈక్వాలిటీ రాష్ట్ర మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ (PoSH) ఏర్పాటుపై కర్ణాటక సినీ పెద్దలతో మమిళా కమిషన్‌ (Karnataka State Women’s Commission) చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి చౌదరి ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. అయితే.. హేమ కమిటీ తరహాలో కర్ణాటక ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ)లో ప్యానెల్‌ ఏర్పాటుకు కర్ణాటక సినీ పెద్దలు ససేమిరా అన్నారని సమాచారం. ఈ విషయంలో భాగస్వామ్యం ఉన్న అందరితో సమావేశం ఏర్పాటు చేసినా.. సినీపరిశ్రమ(Kannada film industry)లో పెద్దలే ఈ సమావేశాన్ని డామినేట్‌ చేశారని సమాచారం. మహిళా నటులు, టెక్నీషియన్స్‌, ఇతర సపోర్టింగ్‌ స్టాఫ్‌ పెద్దగా రాలేదని తెలుస్తున్నది. సమావేశానికి హాజరైన చాంబర్‌ కమిటీ సభ్యులు,  బడా నిర్మాతలు శాండల్‌వుడ్‌ ఒక పరిశ్రమగా లేనందున కమిటీ ఏర్పాటు చేయరాదని వారు వాదించారని తెలిసింది.

కర్ణాటక సినీ పరిశ్రమ నుంచి ఏటా దాదాపు 200 వరకూ సినిమాలు నిర్మితమవుతున్నాయి. 2022 నాటికి ఇండియన్‌ బాక్సాఫీస్‌ మార్కెట్‌లో 9శాతం వాటా కలిగి ఉన్నది. 2023లో అది 2 శాతానికి తగ్గిపోయింది. కర్ణాటక సినీ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారన్న వాస్తవాలను గుర్తించేందుకు సినీ పెద్దలు నిరాకరించారని తెలుస్తున్నది. దశాబ్దాలుగా నడుస్తున్న కన్నడ పరిశ్రమలో ఒక్క లైంగిక వేధింపుల ఘటన కూడా లేదని, క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది లేనేలేదని పరిశ్రమలో సీనియర్లుగా ఉన్న పురుషులు, మహిళలు, నటులు, ప్రొడ్యూసర్లు వాదించారని తెలిసింది.

ఏదిఏమైనా లైంగిక వేధింపుల నిరోధక కమిటీ (Prevention of Sexual Harassment (PoSH)) ఏర్పాటుకు మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ 15 రోజులు గడువు విధించారు. అయితే.. ఈ విషయంలో స్పందించే ముందు లీగల్‌ ఎడ్వయిజర్లను, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను సంప్రదిస్తామని చాంబర్‌ (Karnataka Film Chamber of Commerce (KFCC)) చైర్మన్‌ ఎన్‌ఎం సురేశ్‌ తెలిపారు. ఇక్కడ ఎలాంటి లైంగిక వేధింపులు లేవని, కమిటీ అవసరం లేదని అన్నారు. ఇదిలాఉంటే.. సా రా గోవింద్‌ (కేఎఫ్‌సీసీ మాజీ చైర్మన్‌), నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ వంటివారు హేమ కమిటీ తరహాలో ప్యానెల్‌ ఏర్పాటు చేస్తే సినీ పరిశ్రమ ఇబ్బందులకు గురవుతుందని వ్యాఖ్యానించడం విశేషం. ‘కేరళలో హేమ కమిటీ తరహాలో ఇక్కడ అవసరం లేదు. ఏమైనా ఫిర్యాదులు వస్తే పరిష్కరించడానికి మేం ఉన్నాం. రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా ఉన్నది. అటువంటి కమిటీ వేస్తే పరిశ్రమ ఇబ్బందుల్లోకి వెళుతుంది’ అని గోవింద్‌ అన్నారు.  కమిటీ వేయడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ దాని వల్ల పరిశ్రమ బిజినెస్‌ దెబ్బతింటుందని వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. వందల కుటుంబాలు పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నాయని చెప్పారు. కమిటీతో వారి జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. ఫిలిం ఫైనాన్షియర్లు సినిమాలకు ముందుకు రారని చెప్పారు. కమిటీ ఏర్పాటుతో ‘ఇబ్బంది’ అన్న సీనియర్లు.. ఆ ఇబ్బందేంటో మాత్రం చెప్పలేదని తెలిసింది.

దాదాపు అన్ని సినీ పరిశ్రమల తరహాలోనే శాండల్‌వుడ్‌లోనూ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు లేకపోవడం, పరిశుభ్రమైన టాయిలెట్ల లేకపోవడం, మంచినీటి సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలపై ఫిర్యాదు చేశారని కమిషన్‌ పేర్కొంటున్నది. షూటింగ్‌ స్పాట్‌లో టాయిలెట్‌ లేని కారణంగా రోజంతా మంచినీళ్లు తాగొద్దని తనకు చెప్పారని ఒక బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది.

‘తమకేమీ సమస్యలు లేవని కొందరు మహిళలు చెబితే అభ్యంతరం లేదు. కానీ.. ఎవరైతే బాధపడుతున్నారో వారు మాట్లాడుతారు కదా! చాలా మంది వేధింపులు అంటే తెలియకపోవచ్చు. వాస్తవం ఏమిటంటే.. ఒక ప్యానెల్‌ ఏర్పాటుపై ఇప్పుడు మనం  చర్చిస్తున్నాం.. ఇదే గొప్ప. నేను ఒక చెక్‌బౌన్స్‌ కేసులో చాంబర్‌ను ఆశ్రయిస్తే నాకు ఎలాంటి సహాయం అందలేదు. అందుకే ఒక ప్యానెల్‌ ఉండాలని నేను భావిస్తున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడుతుంటే నన్ను వారించారు. పురుషులు తోసిపుచ్చుతున్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్‌ అంటే ఒక్క  లైంగిక వేధింపులే కాదు. అసభ్య పదజాలం, తాకరాని చోట తాకడం వంటివి సినిమా షూటింగ్స్‌ సమయంలో నేను చూశాను. పనిప్రదేశం ప్రొఫెషనల్‌గా ఉండాలని మేం ఆశిస్తున్నాం’ అని కన్నడ సినీ నటి నీతు షెట్టి అన్నారు.

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ (PoSH) ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ‘ఫైర్‌’ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత లంకేశ్‌ స్పష్టం చేశారు. ఒక వేదిక అంటూ ఉంటేనే బాధితులు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడేందుకు తమకు తగిన అవకాశం దక్కలేదని చెప్పారు. తమ అభిప్రాయాలు చెప్పకుండా నిరోధించిన తీరును మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వయంగా చూశారని అన్నారు. పాతతరం వారు మౌనంగా ఉంటే మేలు అనుకున్నారని, కానీ కొత్త తరం వారు వేధింపులపై మౌనంగా ఉండేందుకు సిద్ధంగా లేరని లంకేశ్‌ చెప్పారు.