Kota Srinivasa Rao | గుడిశెల కాశయ్య @ కోట శ్రీనివాస రావు.. సినీ, రాజకీయ ప్రస్థానం ఇలా..
Kota Srinivasa Rao | కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) అభినయానికి పెట్టని కోట.. నవరస నటనా సార్వభౌముడు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన కోట శ్రీనివాసరావు ప్రస్థానం అద్భుతం.

Kota Srinivasa Rao | హైదరాబాద్ : కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) అభినయానికి పెట్టని కోట.. నవరస నటనా సార్వభౌముడు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన కోట శ్రీనివాసరావు ప్రస్థానం అద్భుతం. సహాయ నటుడిగా, విలన్‌గా విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో టాలీవుడ్( Tollywood )లో అరంగ్రేటం చేసి.. చివరకు ‘సువర్ణ సుందరి’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ముగించారు.
బ్యాంకు ఉద్యోగం వదిలేసి..
కోట శ్రీనివాసరావు 1942 జులై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోట శ్రీనివాస రావు మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే ఆయనకు నటన మీద ఆసక్తి ఉండడంతో.. నాటకాల వైపు వచ్చారు. సినీ రంగంలోకి అడుగుపెట్టక ముందు.. కోట స్టేట్ బ్యాంకులో పని చేసేవారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో నటించారు.
గుడిశెల కాశయ్య పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ..
1978లో చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తో కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో సినిమాలను సీరియస్‌గా తీసుకోకపోయినా, 1985లో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలోని ‘గుడిశెల కాశయ్య’ పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ అద్భుతమైన గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు ఇలా ఏ పాత్ర అయినా అవలీలగా పోషించి, నవరసాలు పండించగల బహుముఖ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బాలీవుడ్‌లోనూ కోట ప్రస్థానం..
2003లో వచ్చిన ‘సామి’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన ‘కాత్తాడి’ ఆయన చివరి తమిళ సినిమా. 1987లో విడుదలైన ‘ప్రతిఘాత్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2016లో విడుదలైన ‘భాగీ’ ఆయన చివరి హిందీ సినిమా. కన్నడలో 1997లో వచ్చిన ‘లేడీ కమిషనర్’తో ఎంట్రీ ఇచ్చారు. 2023 విడుదలైన ‘కబ్జా’ ఆయన చివరి కన్నడ సినిమా. కేవలం నటుడిగానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు.