కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. రూ. 1.5 లక్షలు దోచుకెళ్లారు..
మానవత్వం మంటగలిసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని రక్షించాల్సింది పోయి అతని వద్ద ఉన్న లక్షల రూపాయాలను దోచుకెళ్లారు

లక్నో : మానవత్వం మంటగలిసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని రక్షించాల్సింది పోయి అతని వద్ద ఉన్న లక్షల రూపాయాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇతర వాహనదారులు, స్థానికులు భారీగా గుమిగూడారు. ఆ వ్యాపారవేత్త వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గ్రహించారు. ఇక అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అక్కడ పడిపోయిన నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వ్యాపారవేత్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యాపారవేత్త వద్ద ఉన్న రూ. 1.5 లక్షలను దోచుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.