గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

గుజరాత్ తీరంలో ఆదివారం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉమ్మడి ఆపరేషన్‌లో 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.

గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

602కోట్ల విలువైన 86కిలోల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం

విధాత, హైదరాబాద్ : గుజరాత్ తీరంలో ఆదివారం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉమ్మడి ఆపరేషన్‌లో 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో తప్పించుకునేందుకు పాకిస్తానిలు తమ పడవను అధికారుల బృందంపై నడపడానికి ప్రయత్నించారు. అయితే ఆపరేషన్ బలగాలు కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సంస్థలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్, రాజస్థాన్లన్‌లలో ‘మియావ్ మియావ్’ అని పిలువబడే నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ ను తయారు చేసే మూడు ప్రయోగశాలలను ఎన్సీబీ గుర్తించి, ఏడుగురిని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ప్రయోగశాలల్లో సుమారు 300 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మాదకద్రవ్యాల నిరోధక సంస్థ స్వాధీనం చేసుకుంది. గుజరాత్ ఏటీఎస్ అందించిన రహస్య సమాచారం మేరకు ఎన్సీబీ బృందం గుజరాత్‌, రాజస్థాన్‌లలో మెఫెడ్రోన్ ఉత్పత్తి చేస్తున్న ల్యాబ్‌లను సీజ్ చేయడంతో సముద్రంలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్ చేసి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకోగలిగారు.