విద్యార్థినుల మృతి ఘటనలో వార్డెన్ సస్పెండ్‌.. ఆదేశించిన మంత్రి సీతక్క

భువనగిరిలో ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థినుల అనుమానస్పద మృతి ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్ శైలజను అధికారులు సస్పెండ్ చేశారు

విద్యార్థినుల మృతి ఘటనలో వార్డెన్ సస్పెండ్‌.. ఆదేశించిన మంత్రి సీతక్క

విధాత : భువనగిరిలో ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థినుల అనుమానస్పద మృతి ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్ శైలజను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విద్యార్థినుల అనుమానస్పద మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ వాకాటి కరుణను ఆదేశించారు. దీంతో విచారణాధికారిగా మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరక్టర్ కేఆర్‌ఎస్‌. లక్ష్మిదేవిని విచారణాధికారిగా నియమించారు.

విద్యార్థినుల మృతికి కారణమైన వారిని గుర్తించి శిక్షించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అంతముందు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినుల మృతి ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వం ఈ ఘటనపై మూడు రోజులైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క విచారణ కమిటీ వేస్తున్నట్లుగా ప్రకటించడం పట్ల కవిత ట్వీటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.