పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

విధాత : కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయాల్లో రెండు రోజులుగా కొనసాగిన ఐటీ సోదరులు ముగిశాయి. సోదాల అనంతరం ఐటీ అధికారులు మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్ కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పొంగులేటి ఇంట్లో తాళం వేసి ఉన్న గది తెరిపించేందుకు ఖమ్మంలో ఉన్న ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. ఆమె మధ్యాహ్నం వరకు కూడా రాకపోవడంతో తాళాలు బద్దలు కొట్టి సోదాలను నిర్వహించారు. సోదాలపై పొంగులేటి స్పందిస్తూ 400 మంది ఐటీ అధికారులు 11చోట్ల రెండు రోజులుగా తనిఖీలు చేశారని తెలిపారు. ఎన్నికల వేళ ఐటీ దాడులపై తాను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేశానన్నారు.


ఎన్నికల సంఘాలు ప్రభుత్వాల ఒత్తిడి తలొగ్గి వ్యవహరిస్తూ, అధికార పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లుగా కనబడుతుందన్నారు. కాంగ్రెస్ నేతల మీద మాత్రమే ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ-బీఆరెస్‌ల మద్య ఫెవికాల్ సంబంధానికి ఐటీ దాడులు నిదర్శనం అన్నారు. తుమ్మల ఇంట్లో తనిఖీల్లో ఏమీ లభించలేదని, నా ఇండ్లు, కార్యాలయాల తనిఖీల్లో కూడా ఏమీ దొరకలేదన్నారు. తనిఖీల సందర్భంగా నా అల్లుడు మీద దురుసుగా ప్రవర్తించారని, నా ఉద్యోగి జయప్రకాశ్‌ను కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, వంటి కాలు మీద చైర్‌లో నిలబెట్టారని ఆరోపించారు. ఐటీ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తించారన్నారు. అధికారంలో ఉన్న పార్టీలకు వత్తాసు పలికేలా ఐటీ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు