decomposed bodies । నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న హీరాలాల్ శర్మ!
ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలోని ఒక ఇంట్లో ఐదు మృతదేహాలను కళ్లిపోయిన స్థితిలో శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు కనుగొన్నారు. 46 ఏళ్ల ఒక వ్యక్తి తన నలుగురు కుమార్తెలతో సహా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో చనిపోయి పడి ఉన్నారు.

decomposed bodies । ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలోని ఒక ఇంట్లో ఐదు మృతదేహాలను కుళ్లిపోయిన స్థితిలో శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు కనుగొన్నారు. 46 ఏళ్ల ఒక వ్యక్తి తన నలుగురు కుమార్తెలతో సహా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో చనిపోయి పడి ఉన్నారు. కుమార్తెల్లో ఇద్దరు దివ్యాంగులు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు శనివారం తెలిపారు. అయితే.. మూడు ప్యాకెట్ల సల్ఫస్ విషం, ద్రవం నింపి ఉన్న ఐదు గ్లాసులు, ఒక స్పూన్‌ను పోలీసులు గుర్తించారు.
ఇద్దరు కుమార్తులు దివ్యాంగులని పోలీసులు చెబుతుంటే.. ఇరుగుపొరుగు వారు మాత్రం నలుగురు కుమార్తెలూ దివ్యాంగులేనని అంటున్నారు. నలుగురు అమ్మాయిలు చాలా అరుదుగా బయటకు వచ్చేవారని చెబుతున్నారు. సెప్టెంబర్ 24వ తేదీ తర్వాత తండ్రిని కానీ, పిల్లలను కానీ తాము బయట చూడలేదని తెలిపారు. రంగ్‌పురిలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్‌లోని లోపలి నుంచి తలుపు పెట్టి ఉన్న ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటం, తలుపు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో బిల్డింగ్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళ బృందం సహాయంతో తలుపును బద్దలు కొట్టిన పోలీసులకు ఒక గదిలో వ్యక్తి శవం, మరో గదిలో నలుగురు కుమార్తెల మృతదేహాలు కనిపించాయి.
మృతులను హీరాలాల్ శర్మ, నీతు (26), నిక్కీ (24), నీరు (23), నిధి (20)గా గుర్తించారు. వసంత్ కుంజ్‌లోని ఇండియన్ స్పైనల్ ఇంజురీ సెంటర్‌లో గత 28 ఏళ్లుగా హీరాలాల్ శర్మ కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఏడాది క్రితమే ఆయన భార్య క్యాన్సర్‌తో చనిపోయినట్టు సమీప బంధువులు, స్థానికులు చెప్పారని డీసీపీ మీనా తెలిపారు. నెలకు 25వేలు సంపాదించేవాడని, కానీ.. 2024 జనవరి నుంచి డ్యూటీకి వెళ్లడం లేదని చెప్పారు. విషయం తెలియడంతో హీరాలాల్ సోదరుడు మోహన్ శర్మ, మరదలు గుడియా శర్మ అక్కడికి చేరుకున్నారు. తన భార్య మరణానంతరం కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉండేవాడని, తన కుమార్తెలకు చికిత్స చేయించుకోవడంతోనే ఎక్కువగా గడిపేవాడని వారు తెలిపారు.పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.