గోల్డెన్ అవర్‌లో హాస్పిటల్‌కు చేర్చండి

ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పనిచేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

  • By: Subbu    crime    Jan 19, 2024 11:56 AM IST
గోల్డెన్ అవర్‌లో హాస్పిటల్‌కు చేర్చండి

– రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం

– 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పనిచేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అధికారులకు సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకోని వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయమలో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం, పోలీసు అధికారులు, స్థానిక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బులియన్‌ మార్కెట్‌, ఇతర వ్యాపార సముదాయాలకు చెందిన కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గంటకు యాబైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. ఇందులో 19 మంది మరణిస్తున్నారని, రోజు రోజుకి వాహనాల సంఖ్య ఘననీయంగా పెరగడంతో అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజలు సైతం భాగస్వాములు కావాలని కోరారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఇందుకోసం హై స్పీడ్‌ వాహనాల వినియోగంలో వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాలపై అవగాన కల్పించాలన్నారు. అలాగే అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడం లాంటి చర్యలకు వాహనదారులు పాల్పడకుండా కళాశాల విద్యార్థులతో పాటు, ప్రజలకు అవగాహన తరగతులను నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జాతీయ, స్టేట్‌ ప్రధాన రోడ్డు మార్గాలను కలిపే రోడ్లకు అనుసంధానమైన గ్రామాల్లో రోడ్డ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించగలమని స్పష్టం చేశారు. ప్యాసింజర్‌ వాహనదారుల్లో మార్పు వచ్చేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలుతీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు సెఫ్టీ విభాగానికి చెందిన ఇన్ స్పెక్టర్‌ రవి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలుసూచనలు చేశారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రవాణా శాఖ రూపొందించిన పోస్టర్, కరప్రతాన్ని పోలీస్‌ కమిషనర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ అఫీసర్‌ పురుషోత్తం, ఆర్టీఓ రంగరావు, ఏసీపీలు జితేందర్‌ రెడ్డి, రమేష్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఇన్ స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, యంవీఐలు రమేష్‌ రాథోడ్‌, రవీందర్‌, స్వర్ణలత, షాలిని, ఫహిమా, శ్రీనివాస్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బిలియన్‌ మార్కెట్‌ అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు.