Dhanvantari Stotra | విడియో : శస్త్రచికిత్సకు ముందు ధన్వంతరి స్తోత్ర పారాయణం

Dhanvantari Stotra | విడియో : శస్త్రచికిత్సకు ముందు ధన్వంతరి స్తోత్ర పారాయణం

Dhanvantari Stotra | “వైద్యులు చికిత్స చేస్తారు, కానీ దేవుడు నయం చేస్తాడు” అనే భావాన్ని నిజంగా అనుసరించుకుంటూ, ఒక గ్రూప్ డాక్టర్లు శస్త్రచికిత్స ప్రారంభించే ముందు ధన్వంతరి స్తోత్రం పారాయణం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కర్ణాటకలోని కుమారేశ్వర హాస్పిటల్ నుంచి వచ్చినవిగా చెబుతున్నారు. ఈ వీడియోలో 8 నుండి 10 మంది డాక్టర్లు, వారి సహాయబృందం శస్త్రచికిత్స డ్రెస్‌లో ఆపరేషన్ టేబుల్ చుట్టూ నిలబడి “ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ…” అనే ధన్వంతరి స్తోత్రాన్ని భక్తిగా ఉచ్ఛరిస్తూ కనిపిస్తున్నారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసును స్పృశించింది. విజ్ఞానాన్ని, విశ్వాసాన్ని ఒకే తలుపులో నూరిపోసినట్టుగా ఈ క్షణం భావోద్వేగంగా మారింది. ధన్వంతరిని శ్రీ మహావిష్ణు స్వరూపంగా, దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు, ఆ అమృతభాండాన్ని తీసుకునివచ్చిన దైవమే ధన్వంతరి. ఆయనే ఆయురారోగ్యాలకు అధిపతి. సర్వరోగ నివారణ కారకుడు. అందుకే ఏదైనా చికిత్స తీసుకుంటున్నప్పుడు, మందులు వేసుకుంటున్నప్పుడు ధన్వంతరీ మహా మంత్రాన్ని చదువుకోమంటారు.

ఇదిగో.. ఇదే ఆ ధన్వంతరీ మహామంత్రం

ధన్వంతరీ మహా మంత్రం |

ఓం నమో భగవతే మహాసుదర్శనాయ
వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ
సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ
త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే
శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |

నమామి ధన్వంతరిమాది దేవం సురాసురైర్వందిత పాదపద్మమ్ |
లోకే జరా రుగ్భయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం ||

ధర్మం – వైద్యం – భక్తి కలయికకు ఉదాహరణ

ధన్వంతరి స్తోత్రం హిందూ సంప్రదాయంలో ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి స్వామికి అంకితంగా ఉండే పవిత్ర మంత్రం. దీన్ని పారాయణం చేయడం వల్ల శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. ఈ మంత్రాన్ని శస్త్రచికిత్స ముందు చదవడం ద్వారా, వైద్యులు భౌతిక చికిత్సతోపాటు ఆధ్యాత్మిక రక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది.
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు:
🗨️ “ఇది విజ్ఞానం కాదు… ఇది భావన… ఇది భక్తి.”
🗨️ “వైద్యం వైద్యం గానే ఉండాలి – కానీ అంతర్వేణిలో ధర్మం కలిసితే అది మహాత్మ్యం.”
🗨️ “చాలా బాగుంది కానీ ఆపరేషన్ థియేటర్లో వీడియో తీయడం ఏమంత సరైనది కాదు.”
🗨️ “ఇది సాంప్రదాయం, శాంతి, శక్తి అన్నింటికీ ఉదాహరణ.”
ఈ వీడియోను హర్షా పటేల్ అనే వ్యక్తి X (Twitter) లో పంచుకోగా, ఇప్పటికే 67,000కిపైగా వీక్షణలు వచ్చాయి. శస్త్రచికిత్సకు ముందు వైద్యులు ధన్వంతరి స్తోత్రం పఠించారు. అది సనాతన ధర్మంపై వారికి ఉన్న విశ్వాసం.. అని ఆయన కామెంట్ జత చేశారు.

ఇదిగో ఆ వీడియో..