Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోలతోనే సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోగా ఉన్న రామ్ చరణ్ ఇలాంటి కథను ఎంచుకుని, తన నటనతో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడం ప్రశంసనీయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే అంశాలు కూడా సినిమాలో ఉండటం మరో ప్లస్ పాయింట్‌గా మారింది.

అదే మైన‌స్..

అయితే సినిమా మొత్తానికి మంచి స్పందన వస్తున్నప్పటికీ, ఒక అంశంపై మాత్రం మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే ‘హెల్లల్లాల్లో’ అనే ప్రత్యేక గీతం. విడుదలకు ముందు ఈ పాటకు మంచి ప్రచారం లభించినప్పటికీ, సినిమాలో దాని ప్లేస్‌మెంట్ కథనం ప్రవాహానికి అంతగా సరిపోలేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కథలో సహజంగా ఇమిడిపోకుండా ఈ పాటను బలవంతంగా చేర్చిన భావన కలుగుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శృతి హాసన్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ఈ పాటలో జాన్వీ కపూర్‌ను కూడా చేర్చడం, కొన్ని సన్నివేశాలు అనవసరంగా అనిపించాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పాట లేకపోయినా కథనం ప్రభావం ఏమాత్రం తగ్గేదేమీ కాదని, పైగా సినిమా మరింత బలంగా నిలిచేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాన్వీ పాత్ర‌పై కూడా మిక్స్ డ్ టాక్..

మరోవైపు జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రామ్ చరణ్-జాన్వీ మధ్య ప్రేమకథను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె పాత్ర ప్రవర్తన కొంత అసహజంగా అనిపించిందని ప్రేక్షకులు చెబుతున్నారు.

అయితే ఈ చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, ‘పెద్ది’ మొత్తం మీద భావోద్వేగభరితమైన కథనం, ప‌వ‌ర్ ఫుల్‌ నటన, అద్భుతమైన క్లైమాక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్ల దిశగా పయనిస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.