స్కై డైవింగ్‌లో జిమ్నాస్టిక్స్.. చూస్తే గుండె గుభేలే!
జిమ్నాస్టిక్స్ తెలుసుకదా! నేలపై నాలుగు పలకల ఒక వేదిక మీద ఇటూ ఇటూ పరిగెత్తుతూ చేసే విన్యాసాలు అబ్బుపరుస్తాయి

జిమ్నాస్టిక్స్ తెలుసుకదా! నేలపై నాలుగు పలకల ఒక వేదిక మీద ఇటూ ఇటూ పరిగెత్తుతూ చేసే విన్యాసాలు అబ్బుపరుస్తాయి. అలాంటి జిమ్నాస్టిక్స్‌ను ఆకాశవీధిలో చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఒక మహిళ చేసి చూపించింది. స్కైడైవింగ్ చేస్తూ.. ఈ విన్యాసాలు ప్రదర్శించి.. ఔరా! అనిపించింది. ఆమెపేరు మాజా కుస్జింక్సా. 23 ఏళ్ల ఈ స్కైడ్రైవర్.. జిమ్నాస్ట్ కూడా! ఇప్పుడు ఆమె తన జంట ప్రతిభలను ఒకే సందర్భంలో ప్రదర్శించి.. నెట్టింట సెభాషనిపించుకుంటున్నది. ఆమె తన విన్యాసాన్ని రికార్డు చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే.. బీభత్సమైన స్పందన లభించింది.
తాను జిమ్నాస్ట్‌నని, గాలిలో ఉండగా క్లాసిక్ జిమ్నాస్టిక్స్ చేస్తే ఎలాం ఉటుందని ఆలోచించి.. ఈ విన్యాసానికి పూనుకున్నానని ఆమె తన వీడియోతో పాటు పోస్ట్ చేసింది. పూర్తి రియలిస్టిక్‌గా ఉంటుందని చెప్పనుగానీ.. గాలిలో కిందికి పడిపోతున్నప్పుడు ఎంతైనా తేడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ఒకాయనైతే.. ఆమె బతికే ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఆకాశం నుంచి ఊడిపడుతుండగా చేసినా.. అచ్చం ఇండోర్‌లో చేసినట్టే ఉన్నదని ఒకరు వ్యాఖ్యానించారు.
ఆ పిల్ల ఆకాశంలో ఒక్కసారిగా హెలికాప్టర్ అయిపోయిందని మరొకరు పేర్కొన్నారు. ఇది నిజమేనా? ఆమె ఆకాశంలో ఎలా డాన్స్ చేస్తున్నదని తన ఆరేళ్ల కొడుకు అడిగాడని ఒకరు రాశారు. గతంలో స్కైడైవింగ్ చేయబోని భారత ఆర్మీ ట్రైనీ బ్యాగ్ ఓపెన్ కాక చనిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఈమెకు కూడా పారాచూట్ బ్యాగ్ ఓపెన్ కాకపోతే? అంటూ ఇంకొకరు సందేహం వ్యక్తం చేశారు.