ముగ్గురికి ప్రాణం నిలిపిన ఐదురోజుల శిశువు

బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు అవయవ దానంతో ముగ్గురు పిల్లల ప్రాణాలు నిలిచాయి. గుజరాత్‌లోని సూరత్‌లో హర్షా సతీమణి చేతనకు అక్టోబర్‌ 13న ప్రైవేట్‌ ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది

ముగ్గురికి ప్రాణం నిలిపిన ఐదురోజుల శిశువు

విధాత : బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు అవయవ దానంతో ముగ్గురు పిల్లల ప్రాణాలు నిలిచాయి. గుజరాత్‌లోని సూరత్‌లో హర్షా సతీమణి చేతనకు అక్టోబర్‌ 13న ప్రైవేట్‌ ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించి శిశువును వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా శిశువు బతికే అవకాశం లేదని చెప్పిన వైద్యులు ఐదు రోజుల శిశువును బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఎన్జీవో సంస్థ జీవన్‌దీప్ అవయవ దానం ఫౌండేషన్‌ మేనేజింగ్ ట్రస్టీ విపుల్ ఈ సమాచారం తెలుసుకుని శిశువు తల్లిదండ్రులను కలిసి బ్రెయిన్ డెడ్ అయిన శిశువు అవయవాల దానానికి ఒప్పించారు. ఈ నేపథ్యంలో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు శరీరం నుంచి రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. సంబంధిత అవయవాల బ్యాంకులకు వాటిని తరలించారు. అక్కడి నుంచి

ఢిల్లీకి తరలించిన శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి విజయవంతంగా అమర్చారు. అలాగే శిశువు రెండు మూత్రపిండాలు 13, 15 ఏళ్ల పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడంతో వారికి కొత్త జీవితం లభించింది. ఇందుకు కారణమైన శిశువు తల్లిదండ్రులకు ఆ ముగ్గురు పిల్లల కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు.