Health tips | డయాబెటిస్‌ ఉన్నప్పటికీ కార్న్‌ఫ్లేక్స్‌ తింటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Health tips | డయాబెటిస్‌ ఉన్నప్పటికీ కార్న్‌ఫ్లేక్స్‌ తింటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Health tips : ఈ మ‌ధ్యకాలంలో మ‌ధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నది. ఒక‌సారి మ‌ధుమేహం బారిన ప‌డ్డారంటే ఇక ఆ వ్యాధి నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌టం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవ‌చ్చు. అందుకే డ‌యాబెటిస్ బారినప‌డిన చాలామంది ర‌క‌ర‌కాల ఆహారపు అల‌వాట్లతో షుగ‌ర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయ‌త్నం చేస్తుంటారు. ముఖ్యంగా మిల్లెట్స్‌ షుగర్‌ నియంత్రణకు బాగా పనిచేస్తాయి.

మ‌ధుమేహులు తియ్యని ఆహార ప‌దార్థాల జోలికి అస్సలు వెళ్లరు. అదేవిధంగా రైస్‌ను కూడా ఒక్కపూట‌కే ప‌రిమితం చేస్తారు. మిల్లెట్స్ డయాబెటిస్‌ నియంత్రణలో కీలకం కాబట్టి ఎక్కువ‌గా చిరుధాన్యాలతో చేసిన వంట‌కాలు, రొట్టెలనే తింటుంటారు. జొన్న, స‌జ్జ, మ‌క్కజొన్న, రాగులు, ఊద‌లు, కొర్రలు, అవిసెలు, అరిక‌లు వంటి ధాన్యాల‌తో త‌యారు చేసిన వంట‌కాల‌నే ఎక్కువ‌గా తీసుకుంటారు. అయితే మక్కజొన్న సంబంధిత ఉత్పత్తే అయినా కార్న్ ఫ్లేక్స్ జోలికి వెళ్లరు. ఎందుకంటే అవి షుగ‌ర్ వ్యాధిగ్రస్తుల‌కు ప్రమాద‌క‌ర‌మ‌ట‌.

అందుకే మ‌ధుమేహులు తిన‌కూడ‌ని ఆహార‌ప‌దార్థాల్లో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటిగా మారిపోయింది. కార్న్‌ఫ్లేక్స్ చూడ‌టానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూడ‌గానే ఎవరికైనా వెంట‌నే తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఏ మాత్రం పనికిరావు. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువ‌గా ఉంటుంది. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల‌ను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు బాగా పెరుగుతాయి. తరచూ గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబ‌ట్టి మ‌ధుమేహులు కార్న్‌ ఫ్లేక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.