Chandrayaan-3 | జులైలో జాబిల్లి పైకి చంద్రయాన్-3.. సన్నాహాలు ప్రారంభించిన ఇస్రో..!
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవలకాలంలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే చంద్రయాన్ ప్రాజెక్టుతో అంచనాలకు మించి భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించింది. తాజాగా మరోసారి చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మరోసారి జాబిల్లిపైకి పంపేందుకు సిద్ధమైంది. తొలుత నిర్మించిన లక్ష్యం మేరకు జులైలో ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేసేందుకు అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ మిషన్‌లో చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా […]

Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవలకాలంలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే చంద్రయాన్ ప్రాజెక్టుతో అంచనాలకు మించి భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించింది. తాజాగా మరోసారి చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మరోసారి జాబిల్లిపైకి పంపేందుకు సిద్ధమైంది.
తొలుత నిర్మించిన లక్ష్యం మేరకు జులైలో ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేసేందుకు అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ మిషన్‌లో చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణాన్ని పరిశీలించనున్నారు.
ఇప్పటికే చంద్రయాన్-3 ప్రయోగానికి అవసరమైన అన్ని కీలక పరీక్షలను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. నింగిలోకి దూసుకెళ్లే సమయంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని విజయవంతంగా ధ్రువీకరించిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని యూఆర్ రావ్ కేంద్రంలో గత మార్చిలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరీక్షలు ప్రయోగానికి అవసరమైన పూర్తి విశ్వాసాన్ని ఇచ్చినట్లు ఇస్రో పేర్కొంది.
జులై రెండో వారంలో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ మాడ్యూళ్లతో కూడిన చంద్రయాన్-3 జాబిల్లిపైకి ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలున్నాయి. భారత్ చేపట్టనున్న మూడో లూనార్ మిషనే చంద్రయాన్-3 మిషన్ కావడం విశేషం. మరో వైపు ఈ ఏడాది మొదటి సౌర మిషన్ ఆదిత్య ఎల్ – 1 ప్రయోగాన్ని సైతం ఇస్రో చేపట్టనున్నది.