Brain | ప‌ర్యావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా త‌గ్గిపోతున్న మెదడు సైజు.. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న మారే ప్ర‌మాదం!

Brain విధాత‌: వేగంగా జ‌రిగిపోతున్న ప‌ర్యావ‌ర‌ణ మార్పు (Climate Change) లు మాన‌వ‌జాతి (Mankind) ని ఎంత‌గా ఇబ్బంది పెడుతున్నాయో తెలిసిందే. ఒకచోట అతివృష్టి, మ‌రోచోట అనావృష్టి ప‌రిస్థితుల‌తో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అయితే ప‌ర్యావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల మ‌నిషి ఆరోగ్యంపై నేరుగా ఎలాంటి ప్ర‌భావం ఉంటుంద‌న్న దానిపై శాస్త్రవేత్త‌లు ఇప్పుడిప్పుడే ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. తాజాగా జ‌రిపిన ఓ అధ్య‌య‌నంలో ప‌ర్యావ‌ర‌ణ మార్పుల ప్ర‌భావం మెద‌డు (Brain) పై క‌చ్చితంగా ఉంటుంద‌ని బ‌య‌ట‌ప‌డింది. కాలిఫోర్నియా (California) […]

  • By: Somu    health    Jul 04, 2023 11:11 AM IST
Brain | ప‌ర్యావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా త‌గ్గిపోతున్న మెదడు సైజు.. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న మారే ప్ర‌మాదం!

Brain

విధాత‌: వేగంగా జ‌రిగిపోతున్న ప‌ర్యావ‌ర‌ణ మార్పు (Climate Change) లు మాన‌వ‌జాతి (Mankind) ని ఎంత‌గా ఇబ్బంది పెడుతున్నాయో తెలిసిందే. ఒకచోట అతివృష్టి, మ‌రోచోట అనావృష్టి ప‌రిస్థితుల‌తో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అయితే ప‌ర్యావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల మ‌నిషి ఆరోగ్యంపై నేరుగా ఎలాంటి ప్ర‌భావం ఉంటుంద‌న్న దానిపై శాస్త్రవేత్త‌లు ఇప్పుడిప్పుడే ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.

తాజాగా జ‌రిపిన ఓ అధ్య‌య‌నంలో ప‌ర్యావ‌ర‌ణ మార్పుల ప్ర‌భావం మెద‌డు (Brain) పై క‌చ్చితంగా ఉంటుంద‌ని బ‌య‌ట‌ప‌డింది. కాలిఫోర్నియా (California) లోని నేచుర‌ల్ హిస్ట‌రీ మ్యూజియానికి చెందిన శాస్త్రవేత్త జెఫ్ మోర్గాన్ సితాబెల్ చేసిన ఈ అధ్య‌య‌నంలో.. ప‌ర్యావ‌ర‌ణ మార్పుల ప్ర‌భావం మ‌నిషిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తుంద‌ని.. పైగా మెద‌డు ప‌రిమాణం త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని వెల్ల‌డైంది.

సుమారు 50 వేల సంవ‌త్స‌రాల నుంచి మారుతున్న వాతావ‌ర‌ణ రికార్డులు, మాన‌వ అవ‌శేషాల‌ను సేక‌రించి విశ్లేషించ‌డం ద్వారా జెఫ్ మోర్గాన్ ఈ అభిప్రాయానికి వ‌చ్చారు. త‌న చుట్టూ ఉన్న పర్యావ‌ర‌ణానికి స‌రిపోవ‌డానికి మ‌నిషి మెద‌డు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిణామం చెందింద‌ని మోర్గాన్ తెలిపారు. ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ మార్పులు వేగం పుంజుకున్న నేప‌థ్యంలో.. భ‌విష్య‌త్తులో మాన‌వుని ప్ర‌వ‌ర్త‌న‌పై ఒక అంచ‌నాకు రావ‌డంతో ఈ ప‌రిశోధ‌న స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొన్నారు.

ప‌రిశోధ‌న ఏం చెప్పింది?

మానవుని మెద‌డు ప‌రిమాణం శీత‌ల ప్ర‌దేశాల్లో ఉన్న‌వారితో పోలిస్తే.. ఉష్ణ ప్రాంతంలో నివ‌సించే వారిలో తగ్గిపోయిన‌ట్లు ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే దీనికి స‌రైన కార‌ణాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంద‌ని మోర్గాన్ వెల్ల‌డించారు.

‘ఎందుకో మ‌నం మెద‌డుపై త‌గిన ప‌రిశోధ‌న‌లు చేయ‌లేద‌నిపిస్తోంది. ఇది స‌రికాదు. మాన‌వుని ప‌రిణామ‌క్ర‌మం అంతా మెద‌డు ఆధారంగానే జ‌రిగింది. ప‌రిస్థితి చేయిదాటిపోక ముందే మ‌నం ప‌ర్యావ‌ర‌ణానికి, మెద‌డు సైజుకు ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలి’ అని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ అధ్య‌య‌నం కోసం ఆయ‌న సుమారు 50 వేల సంవ్స‌త‌రాల క్రితం నాటి వివిధ ప్రాంతాలు, జెండ‌ర్లు, వ‌య‌సులు, కాలాల‌కు చెందిన 298 మాన‌వ శిథిలాల‌ను ప‌రిశీలించారు. ఇప్ప‌టి వ‌ర‌కు పొందుప‌రిచిన ప్రాచీన మాన‌వుల 398 మెద‌ళ్ల కొల‌త‌ల‌ను తీసుకున్నారు.

గ‌త 50 వేల ఏళ్ల‌లో భూ గోళం వాతావ‌ర‌ణం ప‌రంగా అనేక మార్పుల‌కు లోనైంది. ఇందులో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన కాల‌మూ ఉంది.. ఆ త‌ర్వాత ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతూ పోతున్న కాల‌మూ ఉంది. ప్ర‌స్తుతం మ‌నం ఈ ద‌శ‌లోనే ఉన్నాం.

ఈ మార్పుల‌కు అనుగుణంగా మాన‌వుని బ్రెయిన్ సైజ్ మార్పు చెంద‌డ‌మే ఇప్పుడు శాస్త్రవేత్త‌ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న విష‌యం. క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ల కాల‌మైన గ్లేషియ‌న్ మాగ్జిమమ్ కాలం నుంచి 17 వేల క్రితం ప్రారంభ‌మైన హోలోసిన్ వార్మింగ్ కాలానికి వ‌చ్చేట‌ప్ప‌టికి మాన‌వుని మెదడు ప‌రిమాణం స‌గ‌టున 10.7 శాతం త‌గ్గిపోయింది.

అయితే ప్ర‌స్తుతం కూడా మాన‌వుని మెద‌డు ప‌రిణామానికి సంబంధించి ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉండొచ్చ‌ని మోర్గాన్ వాద‌న‌. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చ‌డానికి మరీ పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకోవాల్సిన ప‌నిలేద‌ని.. మెద‌డులో చిన్న మార్పు చాలని ఆయ‌న చెబుతున్నారు.

అందుకే ఈ అంశంపై ఎక్కువ ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఉష్ణోగ్ర‌త స్థాయిలో కాక‌పోయినా వ‌ర్ష‌పాతం, తేమ సైతం మెద‌డుపై ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. మొత్తం మీద వాతావ‌ర‌ణ మార్పు ఒక‌టే మెద‌డు ప‌రిణామాన్ని నిర్దేశించ‌ద‌ని.. ఆ మార్పుల వ‌ల్ల పంట‌లు, న‌దీజ‌లాల్లో వ‌చ్చే మార్పులూ దీనికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఈ ప‌రిశోధ‌న స్ప‌ష్టం చేసింది.