దేశ యువతలో పెరుగుతున్న కొలన్‌ క్యాన్సర్‌ కేసులు.. ఈ అలవాట్లుంటే జాగ్రత్త!

దేశంలోని యువతలో కొలన్‌ క్యాన్సర్‌ (పెద్దపేగు క్యాన్సర్‌) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. పెద్ద పేగు క్యాన్సర్‌ 31 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులవైపు మళ్లినట్టు

దేశ యువతలో పెరుగుతున్న కొలన్‌ క్యాన్సర్‌ కేసులు.. ఈ అలవాట్లుంటే జాగ్రత్త!

దేశంలోని యువతలో కొలన్‌ క్యాన్సర్‌ (పెద్దపేగు క్యాన్సర్‌) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. పెద్ద పేగు క్యాన్సర్‌ 31 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులవైపు మళ్లినట్టు కనిపిస్తున్నదని ఢిల్లీ స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డీఎస్‌సీఐ) 2023లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. గతంలో 50 ఏళ్లు దాటినవారిలో ఈ సమస్య కనిపించేది. కొలన్‌ క్యాన్సర్‌ పెద్దపేగులను, పురీషనాళాన్ని ప్రభావితం చేస్తుంది. అది అక్కడికే పరిమితమైతే చికిత్స చేసేందుకు, నివారించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు.

ఈ క్యాన్సర్‌ వల్ల పురీష నాళంలో రక్తస్రావం, మలవిసర్జన అలవాట్లలో మార్పు, పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. దీనికి వెంటనే చికిత్స చేయకుంటే ఇతర శరీర భాగాలకు క్యాన్సర్‌ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంటుంది.

కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ 50 ఏళ్లలోపు యువతలో పెరుగుతున్నది. స్థూలకాయం, శారీరకంగా శ్రమలేకపోవడం, ధూమపానం వంటివి ఇందుకు దారి తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. లించ్‌ సిండ్రోమ్‌, కుటుంబ చరిత్ర వంటివి రిస్కును పెంచుతున్నా.. క్యాన్సర్‌కు అవి పది నుంచి 20 శాతం మాత్రమే కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.

ప్రాసెస్డ్‌ మాంసం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే కొలొరెక్టల్‌ క్యాన్సర్‌కు దారి తీస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. మనం తినే అన్నపానీయాలతో గట్‌ బ్యాక్టీరియా ప్రభావితం అవుతుందని పేర్కొంటున్నారు. తినే ఆహారం, స్థూలకాయం, కొన్ని రకాల ఔషధాలు కూడా గట్‌ బ్యాక్టీరియాను మార్పులకు గురి చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా వాపు ఏర్పడి.. అది క్యాన్సర్‌గా పెరుగుతున్నదని అంటున్నారు.

స్పష్టమైన సంకేతాలు ఉండని కారణంగా కొలన్‌ క్యాన్సర్‌ను తొలి దశల్లో గుర్తించే వీలు ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు. కానీ.. కొన్ని సాధారణ లక్షణాలైన జీర్ణక్రియ అలవాట్లలో స్పష్టంగా కనిపించే మార్పులు అంటే.. విరేచనాలు, లేదా మలబద్ధకం, పొత్తికడుపులో నొప్పి, తిమ్మిరి, అనూహ్యంగా బరువు తగ్గడం, మలంలో రక్తపు ఆనవాళ్లు వంటివి గమనించవచ్చని పేర్కొంటున్నారు.

మద్యపానం, డయాబెటిస్‌, కొన్ని రకాలైన టాక్సిన్స్‌కు లేదా కాలుష్యానికి ప్రభావితం కావడం వంటి పర్యావరణ అంశాలు కూడా కొలన్‌ క్యాన్సర్‌కు కారణాలని చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తగిన పోషకాహారం తీసుకోకపోవడం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినడం, ఆహారంలో పీచుపదార్థాలు లోపించడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే కొలొరెక్టల్‌ క్యాన్సర్‌కు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యువతలో స్థూల కాయం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని చెబుతున్నారు. కొలన్‌ క్యాన్సర్‌ విషయంలో మరిన్ని వివరాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకునేందుకు మీకు సమీపంలోని అర్హులైన వైద్యులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. నిరంతరం చెకప్స్‌ చేయించుకోవడం ద్వారా ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు అవకాశాలు ఉంటాయి.