విఐపి పేషెంట్లంద‌రూ సామాన్యులు.. సామాన్యులంద‌రూ విఐపి పేషెంట్లు!

సామాజిక‌, ఆర్థిక స్థాయి ఏదైనా, వ‌య‌సు ఎంతున్నా.. క్యాన్స‌ర్ ముందు అంతా ఒక‌టే. నొప్పి అంద‌రికీ ఒక‌టే. అందుకే విఐపి పేషెంట్ల‌ను సామాన్యులుగానూ, నార్మ‌ల్ పేషెంట్ల‌ను విఐపిలుగానూ చూడ‌టమే ఆయ‌న లైఫ్ ప్రిన్సిపుల్‌

విఐపి పేషెంట్లంద‌రూ సామాన్యులు.. సామాన్యులంద‌రూ విఐపి పేషెంట్లు!

సామాజిక‌, ఆర్థిక స్థాయి ఏదైనా, వ‌య‌సు ఎంతున్నా.. క్యాన్స‌ర్ ముందు అంతా ఒక‌టే. నొప్పి అంద‌రికీ ఒక‌టే. అందుకే విఐపి పేషెంట్ల‌ను సామాన్యులుగానూ, నార్మ‌ల్ పేషెంట్ల‌ను విఐపిలుగానూ చూడ‌టమే ఆయ‌న లైఫ్ ప్రిన్సిపుల్‌. గ్రామీణ‌, జిల్లా స్థాయిలో ప్రివెన్ష‌న్ టు పేలియేటివ్ కేర్ అందివ్వ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మంటున్న ఆయ‌నే డాక్ట‌ర్ పి. జ‌గ‌న్నాథ్‌. హెప‌టో బిలియ‌రీ క్యాన్స‌ర్ స‌ర్జ‌రీలో ప‌యొనీర్ అయిన ఆయ‌న సెల‌బ్రిటీ డాక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. హార్వ‌ర్డ్ లో ఫెలోషిప్‌, టాటా మెమొరియ‌ల్, లీలావ‌తీ హాస్పిట‌ల్స్‌లో స‌ర్జిక‌ల్ ఆంకాల‌జీ విభాగ ఛైర్మ‌న్ గా సేవ‌లందించి, ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ గా సేవ‌లందిస్తున్న డాక్ట‌ర్ జ‌గ‌న్నాథ్‌తో ముఖాముఖి.

* అందరికీ కాన్సర్ చికిత్స, ప్రివెంటివ్ కేర్ అందుబాటులోకి తేవడానికి మీ విధి విధానాలేంటి ? ప్రభుత్వంతో అసోసియేట్ అవ్వాలని అనుకుంటున్నారా ?

కేవ‌లం ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తే స‌రిపోదు. క్యాన్స‌ర్ పై గెలుపు సాధించాలంటే ప్ర‌భుత్వ స‌హ‌కారంతో పాటుగా పబ్లిక్, ప్రైవేట్, ఫిలాంత్రొటోపిక్ పార్టనర్ షిప్ కూడా ఉండాలి. క్యాన్సర్ ఒక వ్యాధి కాదు. ఒక్కొక్క అవ‌య‌వానికి వ‌చ్చే క్యాన్సర్ డిపరెంట్. ఒక డాక్టర్ అన్ని రకాల క్యాన్సర్ల గురించి ఎక్స్పర్ట్ కాదు. మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉండాలి. అందుకే ప్రివెన్షన్ టు పేలియేషన్ అంటే సంపూర్ణ క్యాన్స‌ర్ కేర్ ఒకేచోట అందాలి అన్న‌ది మా ల‌క్ష్యం. క్యాన్స‌ర్ నివార‌ణ‌, నిర్ధార‌ణ‌, చికిత్స‌, పేలియేటివ్ కేర్ అన్నీ కూడా గైడ్‌లైన్స్ ప్ర‌కారం అందించాలి. చాలామంది ఎక్కువ ఖ‌ర్చు పెడితే మంచి రిజ‌ల్ట్ ఉంటుంద‌నుకుంటారు. ఇది పొర‌పాటు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్. ఇది గ్రామ‌, జిల్లా స్థాయిలో కూడా అందుబాటులో ఉండాలి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొదటి కాన్సర్ కేర్ ప్రోగ్రామ్ ని నేను లీడ్ చేశాను. 40 మంది నిపుణులం కలిసి కూర్చుని దీన్ని తయారు చేశాం. గ్రామ‌, జిల్లా స్థాయిలో క్యాన్స‌ర్ డ‌యాగ్న‌సిస్‌, ట్రీట్‌మెంట్ అయిపోయే దిశ‌గా ఇది ఉంటుంది. క్యాంపులు, అన్ని స్థాయిల్లోని ఆరోగ్య నిపుణుల‌కు ట్రైనింగ్‌, ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుకోవ‌డం ద్వారా ఇది సాధ్య‌మ‌వుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఏఐఎంఐ ఇమేజెస్ ద్వారా హ్యూమ‌న్ ఎర్ర‌ర్స్ ని త‌గ్గించి, ఖచ్చిత‌మైన డ‌యాగ్న‌సిస్ చేయ‌డం వీలుప‌డుతుంది. జిల్లా స్థాయిలోనే దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. టెలిమెడిసిన్ ద్వారా పేషెంట్స్‌ని ఇక్క‌డి నుంచే క‌న్స‌ల్ట్ చేయ‌వ‌చ్చు. అక్క‌డి డాక్ట‌ర్ల‌కు ట్రీట్‌మెంట్ గైడ్ చేయ‌వ‌చ్చు. డాటా నెట్వ‌ర్క్ ఉంటే క‌మ్యూన‌టీ, సోష‌ల్ వ‌ర్క‌ర్లు, డాక్ట‌ర్లు సులువుగా ప‌నిచేసుకోవ‌చ్చు. ఇక‌పోతే ప్రైవేట్ పార్ట్‌న‌ర్ షిప్ కోసం ఒక అపెక్స్ క్యాన్స‌ర్ సెంట‌ర్ ఉండాలి. కాంటినెంట‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్ ఇందుకోసం ప‌నిచేస్తుంది. ఇక ఫిలాంత్రోపి పార్ట్‌న‌ర్ షిప్ కోసం.. అంటే గ్రామస్థాయి క్యాన్స‌ర్ వైద్యం కోసం గ్రామ‌సేవ‌కులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, అక్క‌డి వైద్య‌శాల‌ల డాక్ట‌ర్ల‌ను ట్రైన్ చేయ‌డానికి, ఇత‌ర అవ‌స‌రాల‌కు స‌హాయ‌ప‌డే సంస్థ లేదా వ్య‌క్తులు అవ‌స‌రం. అది సిఎస్ఐఆర్ ఫండ్స్ కావొచ్చు. ఇంకేదైనా ట్ర‌స్టు కావొచ్చు. ఆ సాయంతో జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్‌లో ట్రైన్ చేస్తే వాళ్లు గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలోనే స‌కాలంలో డ‌యాగ్న‌స్ చేయ‌గ‌లుగుతారు. కొన్ని చిన్న చిన్న చికిత్స‌లు కూడా చేయ‌గ‌లుగుతారు. వీట‌న్నింటికీ బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది. కార్య‌రూపం దాల్చ‌డానికి ఒక‌ట్రెండు నెల‌లు ప‌ట్ట‌వ‌చ్చు.

* క్యాన్స‌ర్ స్క్రీనింగ్, చికిత్స‌ల కోసం పెద్ద సెట‌ప్ కావాలి క‌దా జిల్లా స్థాయిలో ఇదెలా సాధ్యం?

స‌ర్జ‌రీ ఇక్క‌డి అపెక్స్ సెంట‌ర్ల‌లో చేసుకున్న‌ప్ప‌టికీ కీమోథెర‌పీ, ఇమ్యునోథెర‌పీ లాంటివి జిల్లా స్థాయిలో కూడా ఇవ్వొచ్చు. రేడియేష‌న్ ఒక్క‌టే ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. 30 నుంచి 40 శాతం స‌ర్జ‌రీల‌ను కూడా జిల్లా స్థాయిలో చేయ‌వ‌చ్చు. బ్రెస్ట్ లంప్ లాంటివాటి కోసం ఇక్క‌డి వ‌ర‌కూ రాన‌వ‌స‌రం ఉండ‌దు. థైరాయిడ్ స‌ర్జ‌రీ కూడా అక్క‌డే అయిపోతుంది. ఏ పేషెంట్ అయినా త‌ను ఉన్న చోటి నుంచి 10 కి.మీ. క‌న్నా ఎక్కువ దూరం క‌ద‌ల‌కూడ‌దంటారు ర‌త‌న్ టాటా. అందుకే పేషెంట్ అయినా, క్యాన్స‌ర్ అనుమానం ఉన్న‌వాళ్ల‌యినా గ్రామం లేదా జిల్లా స్థాయిలోనే ప‌ని అయిపోవాలి. పెద్ద స‌ర్జ‌రీలు, రేడియేష‌న్ లాంటివి అపెక్స్ సెంట‌ర్ అయిన కాంటినెంట‌ల్‌లో చేస్తాం. త‌రువాత జిల్లాలో లేదా గ్రామ స్థాయిలోనే ఫాలోఅప్ అవుతుంది. గ్రామాలు వ‌దిలి, పొలాలు అమ్మేసి వ‌చ్చి, ఇక్క‌డ ఎవ‌రో ఇచ్చే అన్నం ప్యాకెట్ల కోసం ఎదురుచూపులు చూడ‌టం బాధాక‌రం. అక్క‌డే స‌రైన చికిత్స‌లు అందితే ఈ బాధ‌లుండ‌వు క‌దా.

* క్యాన్స‌ర్ అంటేనే డెత్ సెంట‌న్స్ లాగా, సైడ్ ఎఫెక్టుల‌తో పాటు చికిత్స‌క‌య్యే ఖ‌ర్చు భ‌య‌పెడుతుంది. ఈ కార్పొరేట్ వైద్య ప్ర‌పంచంలో చికిత్స అందేదెలా?

దీనికి స‌మాధానం కోసం ఎన్నో రాత్రులు నిద్ర పోలేదు. దీన్ని మిస్సింగ్ మిడిల్ అంటారు. పేద‌ల‌కు గ‌వ‌ర్న‌మెంట్ ఆరోగ్య‌శ్రీ ద్వారా అయిదు ల‌క్ష‌లు వ‌స్తుంది. డ‌బ్బున్న‌వాళ్ల‌కు స‌మ‌స్యే కాదు. ఇన్సూరెన్సు కూడా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ల‌కే కేర్ అంద‌డం క‌ష్టం అవుతున్న‌ది. వాళ్ల‌కు ఇన్సూరెన్స్ ఉండ‌దు. సేవింగ్స్ ఉండ‌వు. ఇదే పెద్ద స‌మ‌స్య‌. అందుకే దీనికోసం ఒక స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లాగా ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టాల‌న్న ఆలోచ‌న ఉంది. ఒక ప‌ది రూపాయ‌లు అద‌నంగా పెట్టుకుంటే దానికి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా వ‌చ్చేట్టు స్కీమ్ ప్లాన్ రెడీగా ఉంది. బ్యాంకులు, కోఆప‌రేటివ్స్‌, ఎంప్లాయ్ బెనిఫిట్ స్కీమ్ ల‌ ద్వారా ఇన్సూరెన్స్ చేయాలి. ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, ఎవిడెన్స్ బేస్‌డ్ గైడ్ లైన్స్ చికిత్స ద్వారా ఖ‌ర్చు త‌గ్గించుకోవాలి. ట్రీట్‌మెంట్ వ‌ద్ద‌ని వ‌దిలేసేవాళ్లున్నారు. కేవ‌లం డబ్బులు లేక‌పోవ‌డం వ‌ల్ల చికిత్స వ‌ద్ద‌ని వెళ్ల‌డ‌మంటే అన్యాయం క‌దా. హాస్పిట‌ల్ కీ, ఇన్సూరెన్స్ కంపెనీకీ మ‌ధ్య కోఆర్డినేష‌న్ కూడా ఉండాలి. రెండూ బ్యాలెన్స్ చేయాలి. ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ ఖ‌ర్చెక్కువై డ‌బ్బుల కోసం తిప్ప‌లు ప‌డాల్సి రావొద్దు. రిక‌మండెడ్‌ వాల్యూ బేస్‌డ్ మెడిసిన్ ద్వారా వైద్యంలో నాణ్య‌త ప్రామాణికం అవుతుంది. మ‌న‌ద‌గ్గ‌ర ఏ రెండు హాస్పిటల్స్‌లోనూ హెల్త్ కేర్ ఒక‌లాగే ఉండ‌టం లేదు. గైడ్‌లైన్స్ ప్ర‌కారం హాస్పిట‌ల్ కూడా ఎథిక‌ల్ గా ట్రీట్‌మెంట్ అందించాలి.

* మీ ఫౌండేష‌న్ గురించి చెప్తారా?

మా ఫౌండేష‌న్ పేరు క్రుసేడ్ అగెయినిస్ట్ క్యాన్స‌ర్. 2005లో ప్రారంభ‌మైంది. దీనికి స‌చిన్ టెండూల్క‌ర్ కూడా హెల్ప్ చేశాడు. క్యాన్స‌ర్ బారిన ప‌డ్డ చిన్న పిల్ల‌ల‌కు ఇది స‌హాయ‌ప‌డుతుంది. ఇలా మా ఈ చైల్డ్ ఫౌండేష‌న్‌తోనైనా ఓ వంద‌మందికి సాయ‌ప‌డ‌గ‌ల‌మేమో. అంద‌రికీ చేయ‌లేం. మేము ఇప్ప‌టివ‌ర‌కూ 700 మంది పిల్ల‌ల‌కు ఉచిత వైద్యం అందించ‌గ‌లిగాం. కేర్ ఇండియ‌న్ క్యాన్స‌ర్ సొసైటీ కూడా హెల్ప్ చేస్తుంది. 4-5 ల‌క్ష‌లు ఒక పేషెంటుకు ఇస్తారు. అందుకే ఒకట్రెండు ఫౌండేష‌న్‌ల‌తో ఇది సాధ్యం కాదు. అందుకే బీమానే బెస్ట్‌.

* హాస్పిట‌ల్స్ పైన గ‌వ‌ర్న‌మెంట్ మానిట‌రింగ్ ఉంటే మంచిదంటారా?

మంచిదే. కానీ, ఇది ప్రాక్టిక‌ల్ గా సాధ్యం కాదు. అందుకే ప్ర‌తి హాస్పిట‌ల్ లోనూ ఇంట‌ర్న‌ల్ గా ఆడిటింగ్ టీమ్ ఉండాలి. ఏమేం ట్రీట్‌మెంట్ ఇచ్చాం.. వాటి రిజ‌ల్ట్ ఏంటో ఆడిట్ అవ్వాలి. న‌ష్టం జ‌రిగితే మ‌రోసారి ఆ పొర‌పాటు జ‌ర‌గ‌కుండా ఏం చేయాలనే డిస్క‌ష‌న్ జ‌ర‌గాలి. హార్వ‌ర్డ్ లో ఈ మెడిక‌ల్ ఆడిట్స్ ప‌బ్లిష్ కూడా అవుతాయి. దానివ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంది. మా కాంటినెంట‌ల్‌లో ఇలాంటి వ్య‌వ‌స్థ ఉంది. వెబ్‌సైట్‌లో అన్ని వివ‌రాలూ ఉంటాయి. త‌ప్పు చేయ‌న‌ప్పుడు నిజం చెప్ప‌డానికి భ‌య‌ప‌డొద్దు.

* ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ ట్రీట్ మెంట్స్ అనే మాట ఇప్పుడు వినిపిస్తున్నది. దాంట్లో కాంప్లిమెంటరీ చికిత్సలు. డైట్, కౌన్సెలింగ్, మానసిక విషయాలను డీల్ చేయడం.. ఇలాంటివన్నీ ఉన్నాయి. దాని గురించి మీరేం చెప్తారు?

స‌పోర్టు చేస్తాను. మీర‌న్న‌ట్టు మాన‌సిక స్థితి చాలా ముఖ్యం. అది బాగుంటే చికిత్స వ‌ల్ల క్యాన్సర్ విషయమే కాదు, ఏ జబ్బయినా సరే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కొంతమంది పేషెంట్లు పొద్దున జిమ్ కి వెళ్లొస్తారు. ట్రీట్ మెంట్ తీసుకుని, ఆఫీసుకు వెళ్లిపోతారు. ఎక్కడా టెన్షన్ ఉండదు. అలాంటి వాళ్లలో రికవరీ బాగుంటుంది. రిజల్ట్ బాగుంటుంది. అంటే ఇంకేమన్నా ట్రీట్ మెంట్ చేసుకోవచ్చా? అని అడుగుతుంటారు. ఏ సిస్టమ్ కూడా మంచిది కాదని అనలేం. మిగతావి కూడా వాడొచ్చు. హోలిస్టిక్ విధానం ఉండాలి. పేషెంటు కండిషన్, ఏ చికిత్స సరైనదని రెండు నిమిషాల్లో తెలిసిపోతుంది. మిగతాదంతా కౌన్సెలింగ్ నే. పేషెంటుకు క్యాన్సర్ అంటే ఒక భయం. చికిత్స అంటే ఇంకో భయం. ముఖ్యంగా కీమో. ఒక పేషెంటు రోజూ కీమోథెరపీ నవ్వుతూ తీసుకుంటూ ఉండేవాడు. అదెలాగా అని అడిగితే, ‘‘ఇది నేను రికవర్ కావడానికి హెల్ప్ చేస్తుందని రోజూ దండం పెట్టుకుంటూ తీసుకుంటున్నాను’’ అన్నాడు. అలా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ రూట్ లో వెళ్తే నేను వెళ్లగలను అనుకుంటే వెళ్లిపోతారు. అలాగే ట్రీట్ మెంట్ నాకే హెల్ప్ చేస్తుందని అనుకుంటే స్మూత్ గా వెళ్లిపోతుంది. చాలామంది చికిత్స స్టార్ట్ చేయడానికి భయపడుతారు. అందుకే మేమొక గ్రూప్ కమ్యూనిటీ పెట్టాం. ఒక పేషెంటు కీమో చేయించుకుని బాగుపడ్డానని చెబితే పది మంది డాక్టర్ల మాట కంటే ఎక్కువ. సెలబ్రిటీ పేషెంట్ల‌కు కూడా అదే చెప్తాను. వాళ్ల వ‌ల్ల ఇంకొంద‌రిలో కాన్ఫిడెన్స్ వ‌స్తుంది.

* క్యాన్స‌ర్ జ‌న్యుప‌ర‌మైన‌దేనా? కుటుంబంలో ఉంటే మిగ‌తావారికీ రావొచ్చా?

రెటినోబ్లాస్టోమా, రొమ్ము క్యాన్స‌ర్ కుటుంబాల్లో వ‌చ్చేవే. కోల‌న్ క్యాన్స‌ర్ కూడా కొన్ని కుటుంబాల్లో క‌నిపిస్తుంది. అందుకే ఇప్పుడు మాలిక్యుల‌ర్ లెవ‌ల్ లో ఫోక‌స్ ఉంది. ఇమ్యునోథెర‌పీ, టార్గెటెడ్ థెర‌పీలు క‌ణ‌స్థాయిలో వ‌చ్చే మార్పుల‌ను టార్గెట్ చేస్తాయి. క్యాన్స‌ర్ మ‌ల్టీఫాక్టోరియ‌ల్‌. జ‌న్యువులు, ఎన్విరాన్ మెంట్ రెండూ ఇన్వాల్వ్ అవుతాయి. జ‌న్యుపుర‌మైన రిస్కు ఉన్న‌ప్పుడు ముందు జాగ్ర‌త్తే కాపాడుతుంది. అల‌వాట్లు మార్చుకోవ‌డం, స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం వ‌ల్ల సెకండ్ స్టేజ్ లోపే డ‌యాగ్న‌స్ అవుతుంది. ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌తో క్యాన్స‌ర్‌ని ప్రేరేపించే జ‌న్యువు బ‌ల‌హీన‌మ‌వుతుంది.

* జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల‌కు ప‌రిష్కారాలేమైనా ఉన్నాయా?

మ‌న శ‌రీరంలోని ప్ర‌తీ క‌ణం పుట్ట‌డం, పెర‌గ‌డం, చ‌నిపోవ‌డం ఇదంతా జ‌ర‌గడానికి ఒక సిగ్న‌లింగ్ పాత్‌వే ఉంటుంది. క‌ణాలు చ‌నిపోవ‌డాన్ని ప్రోగ్రామ్‌డ్ సెల్ డెత్ అంటారు. ప్ర‌తీ క‌ణం చ‌నిపోవ‌డానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో స్విచాఫ్ అవుతాయి. కాని, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల స్విచాఫ్ కాక‌పోవ‌డంతో, నార్మ‌ల్ క‌ణాలు చ‌నిపోవ‌డానికి నిరాక‌రించి పెరుగుతూ ఉంటాయి. ఈ ప్ర‌క్రియ పాత్‌వేని బ్లాక్ చేసే డ్ర‌గ్స్ వ‌స్తున్నాయి. అయితే ఇలా ఒక పాత్‌వేని బ్లాక్ చేస్తే క‌ణాలు ఇంకో పాత్ వే ఓపెన్ చేసుకుని పెరుగుతూ ఉన్నాయి. అందుకే మ‌ల్టిపుల్ పాత్ వేల‌ను బ్లాక్ చేసే డ్ర‌గ్స్ త‌యారీపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవ‌న్నీ స‌ఫ‌ల‌మైతే ఫ‌లానా బాక్టీరియాకి ఫ‌లానా యాంటీబ‌యాటిక్ అన్న‌ట్టుగా ఆయా పాత్‌వేల‌ను బ్లాక్ చేయ‌డానికి డ్ర‌గ్స్ అందుబాటులోకి వ‌స్తాయి.

* క్యాన్స‌ర్ వ్యాధి కాదు, బి17 విట‌మిన్ లోప‌మ‌ని కొంద‌రు.. ప్ర‌త్యేక‌ మిన‌ర‌ల్ వాట‌ర్‌తో క్యాన్స‌ర్ త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఇంకొంద‌రు.. ఇలా ర‌క‌ర‌కాల మెసేజ్‌లు ఫార్వ‌ర్డ్ అవుతుంటాయి. వీటిలో నిజం ఉందా?

ఇప్పుడు డాక్ట‌ర్ల వైద్యం క‌న్నా మిగ‌తావాళ్లు ఇచ్చే వైద్యం ఎక్కువ అయిపోతున్న‌ది. ఏదో మూలిక తింటే క్యూర్ అవుతావంటారు. కీమో వ‌ల్ల ఉప‌యోగం లేదు, బాధ త‌ప్ప‌.. అందుకే తీసుకోవ‌ద్దంటారు ఇంకొందరు. కానీ ఎవ‌రి మాటా విన‌వ‌ద్దు. డౌట్ ఉంటే మా ద‌గ్గ‌రికి రండి. స‌మాజం, వాట్స‌ప్ మెసేజ్‌లు, గూగుల్ డాక్ట‌ర్ల‌ను న‌మ్మొద్దు.

* ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న మీరు.. వాటిలో గ‌ర్వంగా ఫీల‌య్యేది ఏది?

లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు, ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు.. ఇలా అవి వ‌స్తూనే ఉంటాయి. కానీ మ‌నం చేసే ప‌నే నిలిచిపోతుంది. నా పబ్లికేష‌న్ల‌లో మేం చేసిన స్ట‌డీ ఒక‌టి చాలా ముఖ్య‌మైన‌ది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ కూడా చాలా కామన్. అయితే ఇది ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దక్షిణాదిలో లేదు. బీహార్ లోని 30 గ్రామాల్లో దీనిపై స్ట‌డీ చేశాం. స్క్రీనింగ్‌, నేల‌, నీళ్లు అన్నీ టెస్ట్ చేశాం. అప్పుడే అక్కడి గంగా వాటర్, సాయిల్ రెండూ విష‌పూరితం కావ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని తేలింది. అక్క‌డి మ‌ట్టి లో హై లెవల్స్ మెటల్స్ చూశాం. పారిశ్రామిక వ్య‌ర్థాల‌న్నీ క‌ల‌వ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తింది. దీనికి సులువైన ప‌రిష్కారం స్వ‌చ్ఛ‌మైన తాగునీరే. అందుకే నమో గంగా ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. టయోటా కార్పొరేషన్ వాళ్ళు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టుకున్నారు. స‌ర్జ‌న్ అయివుండి, ఈ స్ట‌డీలు ఎందుకు చేస్తున్నార‌ని అడిగారు చాలామంది. కానీ నేను చికిత్స ఇస్తే ఓ ప‌దిమందే లాభ‌ప‌డుతారు. కానీ ప్రివెంట్ చేస్తే వెయ్యి మందికి బెనిఫిట్ క‌దా.

* 40 ఏళ్ల అనుభ‌వంలో మ‌ర్చిపోలేని పేషెంట్‌, స‌వాలు విసిరిన కేసు ఏదైనా ఉందా?

విషాద‌క‌ర‌మైన‌వే ఎక్కువ గుర్తున్నాయి. ఇంకా బాగా చేసుండాల్సింది అనుకుంటూ ఉంటాను. నిజాయితీ గ‌ల ఒక పొలిటీషియ‌న్‌కి పాంక్రియాస్ వ్యాధి. వ‌య‌ల్ ట్యూబ్స్ వేసుకుని అసెంబ్లీకి వెళ్లేవారాయ‌న‌. చాలా అడ్వాన్స్ డ్ స్టేజ్ లో కూడా ప‌నిచేశారు. అలాంటి వ్య‌క్తిని బ‌తికించ‌లేక‌పోయామే అని బాధేస్తుంది. ప్ర‌తి కేసూ స‌వాలుతో కూడుకున్న‌దే. స‌వాళ్ల‌ను ఇష్ట‌ప‌డ‌టం, స‌వాలును ఎదుర్కోవ‌డం రెండూ వేరువేరు. రెండేళ్ల పిల్ల‌వాడికి లివ‌ర్లో ట్యూమ‌ర్ ఉంది. మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చాడు. మొద‌ట కీమో ఇస్తే త‌గ్గింది. ఇప్పుడు మూడు వంతుల లివ‌ర్ తీసేయాలి. కాంప్లికేటెడ్ స‌ర్జ‌రీ. 11 గంట‌లు ప‌ట్టింది. పొద్దున 8 నుంచి రాత్రి 9.30 వ‌ర‌కు. ఆ బాబు త‌ల్లిని వ‌దిలిపెట్ట‌డు. కాబ‌ట్టి ఆమె ఆ పిల్లాడి మంచం మీదే వారంరోజులు కూర్చుని ఉంది. దేవుడి ముందు అంద‌రూ ఒక‌టే. నా అనుభ‌వంలో నేను నేర్చుకున్న పాఠం ఒక‌టే.. విఐపి అయితే నార్మ‌ల్ పేషెంటుగా, నార్మ‌ల్ పేషెంటును విఐపిగా చూడాల‌న్న‌ది ప్రిన్సిపుల్‌. ఎవ‌రికైనా బాధ ఒక‌టే.

* మీ పిల్ల‌లు కూడా మీ వార‌సుల‌వుతున్నారా?

నేను మంచి రోల్ మాడ‌ల్ కాదు. మా జ‌న‌రేష‌న్‌లో పెద్ద‌లేం చెబితే అదే. ఇప్పుడ‌ది త‌ప్ప అన్నీ చేస్తారు. మెడిసిన్ డిఫిక‌ల్ట్ ప్రొఫెష‌న్‌. మ‌న‌సు గ‌ట్టిగా ఉండాలి. నాకు ఇద్ద‌ర‌మ్మాయిలు. పెద్ద‌మ్మాయి క్లైమేట్ చేంజ్ కోసం పోరాటం చేస్తోంది. చిన్న‌మ్మాయి పిల్ల‌ల కోసం ఆడియో కంటెంట్ త‌యారుచేస్తోంది. ఎవ‌రైనా స‌రే పాష‌న్ ఉన్న‌ది చేయాలి. జీవితం అంతా నీకు ఇష్టం ఉన్న‌ది చేస్తూ బ‌త‌క‌లేవు. ఎన్నో ట్రై చేసి, విఫ‌ల‌మ‌య్యాకే మ‌న అస‌లైన పాష‌న్ ఏంట‌నేది తెలుస్తుంది. అయితే, 90 శాతం మందికి ఏం చేయాలో తెలియ‌దు. ఏం చేస్తే సంతోషంగా ఉంటామ‌నే క్లారిటీ ముఖ్యం. ఆ క్లారిటీ ఎంత తొంద‌ర‌గా వ‌స్తే అంత తొంద‌ర‌గా స‌క్సెస్ అవుతాం. బిల్ గేట్స్‌, స్టీవ్ జాబ్స్ కి హై స్కూల్ అయ్యాక క్లారిటీ వ‌చ్చింది. ఇక కాలేజీకి వెళ్ల‌మ‌ని మానేశారు. అలా ఓ ప‌దేళ్లు ముందు స్టార్ట్ చేసి, మిగ‌తావాళ్ల‌క‌న్నా ముందెళ్లిపోయారు. జీవితంలో అయినా, క్యాన్స‌ర్ విష‌యంలో అయినా ముందే క్లారిటీ వ‌స్తే మంచి రిజ‌ల్ట్ ఉంటుంది.

* క్యాన్స‌ర్‌ను తొంద‌ర‌గా గుర్తించాలంటే ఎలా?

మ‌న‌కి, పాశ్చాత్యుల క‌న్నా క్యాన్స‌ర్ స‌ర్వైవ‌ల్ 20 నుంచి 30 శాతం త‌క్కువ‌. ట్రీట్ మెంట్ కి వెళ్ల‌క అశ్ర‌ద్ధ చేయ‌డం వ‌ల్ల కొంత‌, తెలిసినా యాక్ష‌న్ తీసుకోక‌పోవ‌డం మ‌రికొంత ఇందుకు కార‌ణం. మ‌న శ‌రీరం హెచ్చ‌రికలు ఇస్తుంది. వాటికి స్పందించి మ‌నం త‌గిన చ‌ర్యలు తీసుకోవాలి. ఆ 7 హెచ్చ‌రిక‌లూ (CAUTION ), మ‌నం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు (ACTION) ఏంటంటే,

1. సి – పేగులు లేదా బ్లాడ‌ర్ అల‌వాట్ల‌లో మార్పు –

చ‌ర్య – అల్ట్రాసోనోగ్ర‌ఫీ, ఎండోస్కోపీ

2. ఎ – మాన‌ని పుండు

చ‌ర్య – బ‌యాప్సీ, నోరు, చ‌ర్మ సంబంధిత‌ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం

3. యు – మ‌లంలో ర‌క్తం లేదా ఇత‌ర అసాధార‌ణ ద్ర‌వం రావ‌డం

చ‌ర్య – రెక్ట‌ల్ ప‌రీక్ష‌, కొల‌నోస్కోపీ

పీరియ‌డ్స్ మ‌ధ్య‌లో అసాధార‌ణ ర‌క్త‌స్రావం

చ‌ర్య – గైన‌కాల‌జిస్టును క‌లిసి స‌ర్విక్స్‌, బ‌యాప్సీ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం.

4. టి- రొమ్ము, వ‌ష‌ణాలు, ఇంకెక్క‌డైనా మందంగా (థిక్‌గా) కావ‌డం లేదా గ‌డ్డ ఏర్ప‌డ‌టం

చ‌ర్య – అల్ట్రాసోనోగ్ర‌ఫీ చేసి స‌మ‌స్య ఉంటే ఎఫ్ఎన్ఎసి చేయాలి.

5. ఐ – అజీర్తి లేదా మింగ‌డంలో ఇబ్బంది

చ‌ర్య – ఎండోస్కోపీ

6. ఒ- పుట్టుమచ్చ లేదా నోటిలో పుండు సైజులో మార్పు

చ‌ర్య – బ‌యాప్సీ

7. ఎన్ – గొంతు బొంగురుపోవ‌డం లేదా ఆగ‌ని ద‌గ్గు

చ‌ర్య – ఇఎన్‌టి ప‌రీక్ష‌లు, ఛాతి ఎక్స్‌రే

పాంక్రియాస్ స‌మ‌స్య బ‌య‌ట‌ప‌డ‌దు. కానీ ప్ర‌తీ పేషెంట్ అంటుంటారు. ఆరు నెల‌ల నుంచి ఏదో అవుతోంద‌ని అనిపిస్తుంది. కానీ ప‌ట్టించుకోలేద‌ని. మామూలు ద‌గ్గే అనుకుంటారు. వారం, ప‌ది రోజులైనా త‌గ్గ‌దు. రెండువారాలైనా త‌గ్గ‌కుంటే ఓ ఎక్స్‌రే చేయించాల‌న్న ఆలోచ‌న రావాలి. ఇలా ప్ర‌తి హెచ్చ‌రిక‌ని (కాష‌న్‌) నిర్ల‌క్ష్యం చేయ‌కుంటే స‌కాలంలో చికిత్స తీసుకోవ‌చ్చు. టీబీ, డ్ర‌గ్ రెసిస్టెంట్ బాక్టీరియా క్యాన్స‌ర్ క‌న్నా ఎక్కువ ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. అలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. కానీ క్యాన్స‌ర్ స్టేజ్ 1, 2 అయితే అది పూర్తిగా న‌య‌మ‌య్యే అవ‌కాశం 80 నుంచి 90 శాతం ఉంటుంది.

ఇంట‌ర్వ్యూ : ర‌చ‌న ముడుంబై