Health tips | ఈ విలువైన పోషకాలు అందాలంటే మీ డైట్‌లో బీట్‌రూట్‌ ఉండాల్సిందే..!

Health tips | ఈ విలువైన పోషకాలు అందాలంటే మీ డైట్‌లో బీట్‌రూట్‌ ఉండాల్సిందే..!

Beetroot : చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి నిదానంగా బయటపడవచ్చు. వాటిలో బీట్‌రూట్ ఒకటి. బీట్‌రూట్‌ తినడంవల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. శరీరానికి అనేక పోష‌కాలు అందుతాయి. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో బీట్‌రూట్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇవేగాక బీట్‌రూట్‌తో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మ‌రి అవేంటో తెలుసుకుందామా..?


బీట్‌రూట్‌తో లాభాలు

  • బీట్‌రూట్‌ల‌లో బీటాలైన్స్ అనే ఫైటో న్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాల కారణంగా కడుపులోని దీర్ఘకాలిక మంట నివారించబడుతుంది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల కీళ్లలో నొప్పి కూడా త‌గ్గుతుంది.
  • అంతేగాక బీట్‌రూట్‌లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బీట్‌రూట్‌ జ్యూస్‌లో గ్లూటామైన్, అమైనో ఆమ్లాలు, 3.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్దకం, పేగు వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్‌ లాంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. జీవక్రియల‌ను మెరుగుపరుస్తుంది. కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు ఎనర్జీగా ఉంచుతుంది.
  • బీట్‌రూట్‌ల‌లో ఉండే నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్త నాళాలను ముడుచుకోకుండా చేయ‌డానికి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతాయి. తద్వారా మెదడు పనితీరు వృద్ధి చెందుతుంది.
  • అదేవిధంగా బీట్‌రూట్‌ల‌లో ఉండే డైటరీ నైట్రేట్‌ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో, గుండెపోటు నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది.
  • బీట్‌రూట్‌లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి. అంతేకాక అసాధారణ కణాల పెరుగుదలను, కణితి కణాల విభజనను తగ్గిస్తాయి. బీట్‌రూట్‌ల‌లో ఉండే విటమిన్ బి6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్‌, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయడంలో సాయపడుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పోషకాల కోసం రోజూవారి డైట్‌లో బీట్‌రూట్‌ ఉండేలా చూసుకోవాలి.