ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని 60 మంది బందీల గల్లంతు !

- శరణార్థి శిబిరాల్లో 45 మంది మృతి
ఇజ్రాయెల్ (Israel) జరిపిన దాడుల వల్ల 60 మంది బందీల ఆచూకీ తెలియడం లేదని హమాస్ (Hamas Conflict) ప్రకటించింది. ఇప్పటి వరకు 23 మంది బందీల మృతదేహాలను శిథిలాల కింద కనుగొన్నామని తెలిపింది. తాజాగా సెంట్రల్ గాజాలోని అల్ మగాజీ అనే శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 45 మంది చనిపోయారు.
అక్కడకు సమీపంలోని అల్ ఫకురా పాఠశాలలో నడుస్తున్న శరణార్థి శిబిరంపైనా కాల్పులు జరగడంతో 15 మంది కన్నుమూశారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన ఉగ్రదాడి అనంతరం.. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తొలుత గగనతల దాడులు, అనంతరం భూ తల దాడులతో హమాస్ ఉపరితల, భూగర్భ స్థావరాలను నేలమట్టం చేస్తోంది.
అయితే ఈ క్రమంలో అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 9,488 పాలస్తీనియన్లు చనిపోయారని.. వారిలో 3,900 మంది చిన్నారులు, 150 మంది వైద్య సిబ్బంది ఉన్నారని పాలస్తీనా ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు ప్రతిదాడుల్లో తాము ఇప్పటివరకు 2500 లక్ష్యాలను నాశనం చేశామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. నేల, జల, వాయు మార్గాల్లో భద్రతా సిబ్బంది ముప్పేట దాడి చేస్తున్నారని వెల్లడించింది.
సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గాజాలో పర్యటించారు. గాజాలో బందీలను గుర్తించడానికి అమెరికా అడుగు మందుకు వేసింది. తమ దగ్గర ఉన్న అత్యాధునిక ఎంక్యూ 9 డ్రోన్లను అక్కడ ప్రవేశపెట్టనుంది. వీటికి ఉండే సెన్సర్‌లు, కెమెరాల ద్వారా భూ గర్భంలో ఉన్న బందీలనూ గుర్తించేందుకు అవకాశముంటుంది.
మరోవైపు పాలస్తీనాకు మద్దతుగా వివిధ దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇరాన్, తుర్కియే తదితర దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఇజ్రాయెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తుర్కియే ఒక అడుగు ముందుకు వేసి ఇజ్రాయెల్‌లోని తమ రాయబారిని వెనక్కు పిలిపించింది.