మాతృభూమిపై మమకారం..సొంతూరిపై ప్రేమ ఎంత గొప్పదో చాటిచెప్పిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. భారతీయురాలిగానే నా చివరి శ్వాస విడుస్తానని, నేను పుట్టిన మట్టిలోనే..నా కట్టే కాలాలని 94ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని.. భారత పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరూ అమెరికా పౌరసత్వం కోసం ఎగబడుతున్న వేళ.. మహాలక్ష్మమ్మ తిరిగి భారత పౌరసత్వం కోరుకోవడం వైరల్ గా మారింది. నా చివరి శ్వాసను భారతదేశంలోనే తీసుకోవాలని ఆమె పేర్కొనడం అందరినీ కదలిస్తుంది.
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో భారత పౌరసత్వం కోసం నమోదైన మహాలక్ష్మమ్మ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తాజాగా విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా 94 ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ స్వయంగా కలెక్టర్ ను కలిసి..తాను తొమ్మిదిన్నర పదుల వయసుకు చేరువవుతున్నానని, భారతీయురాలిగా నా చివరి శ్వాస తీసుకుని..నా జన్మభూమిలో కన్నుమూయాలనుకుంటున్నానని, నా అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరగాలన్నది నా చివరి కోరిక అని..అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానని వివరించారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నానని, సాధ్యమైనంత త్వరగా భారత పౌరసత్వం ఇప్పించండి అంటూ ఆమె కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, చట్టానికి లోబడి ఉంటానని కలెక్టర్ వద్ద ఒప్పంద వాగ్దానం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు స్వదేశంలో జీవించడానికి చట్ట ప్రకారం హక్కు కల్పించాలని విన్నవించారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ భర్త నాగభూషణం చనిపోయారు. భర్త మరణం తర్వాత ఆమె అమెరికాలోని వర్జీనియా పీటర్స్‌బర్గ్‌లో స్థిరపడ్డ ప్రముఖ క్యాన్సర్ వైద్యుడైన తన కుమారుడు బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే 2000 జులై 27న మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వం పొందారు. పౌరసత్వం వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. మహాలక్ష్మమ్మ 2018లో కుటుంబంతో కలిసి స్వగ్రామం చింతగుంపలకు వచ్చారు. ఆమె కుమారుడు కొండ్రగుంట బుచ్చయ్య చౌదరి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా మహాలక్ష్మమ్మ చింతగుంపలలో నివసిస్తున్నారు. భారత పౌరురాలిగా చివరి శ్వాస సొంతూరులోనే తీసుకోవాలన్నది ఆమె కోరిక. ఈ క్రమంలోనే తిరిగి భారత పౌరసత్వం పొందడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
స్వగ్రామంలోనే తన అత్యక్రియలు జరగాలని కలెక్టర్ ను వేడుకుంటూ భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ చేసిన విన్నపం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. దీనిపై కలెక్టర్ వినోద్‌కుమార్ స్పందిస్తూ విచారణ పూర్తిచేసి అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి నివేదిక పంపిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక వెళ్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం నుంచి త్వరలో మహాలక్ష్మమ్మకు పౌరసత్వం వస్తుందని తెలిపారు.
94 ఏళ్ల వయసులో మాతృభూమి పిలుపు..! ❤️
బాపట్ల జిల్లాకు చెందిన మహాలక్ష్మమ్మ.. 2000లో అమెరికా పౌరసత్వం పొందినా, ఇప్పుడు మిగిలిన జీవితాన్ని పుట్టిన నేలపైనే గడపాలనే సంకల్పంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు.
“చివరి శ్వాస కూడా భారతదేశంలోనే విడవాలి” అన్న ఆమె కోరిక పలువురిని… pic.twitter.com/wvntY0zxHh
— greatandhra (@greatandhranews) June 26, 2026