2022 నుంచి జైలులోనే ఉన్న మహిళ‌కు 4 నెల‌ల గ‌ర్భం

అమెరికా లోని ఫ్లోరిడా జైలులో ఒక దిగ్భ్రాంతిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. 2022 నుంచి సెంట‌ర్‌ జైలులోనే క‌స్ట‌డీలో ఉన్న ఓ మ‌హిళ గ‌ర్భ‌వ‌తి

2022 నుంచి జైలులోనే ఉన్న మహిళ‌కు 4 నెల‌ల గ‌ర్భం

అమెరికా (America) లోని ఫ్లోరిడా జైలులో ఒక దిగ్భ్రాంతిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. 2022 నుంచి ఇక్క‌డి ట‌ర్న‌ర్ గులీఫోర్డ్ నైట్ క‌రెక్ష‌న‌ల్ సెంట‌ర్‌ జైలులోనే క‌స్ట‌డీలో ఉన్న ఓ మ‌హిళ గ‌ర్భ‌వ‌తి అని తేలింది. దీనిపై ఆమె సోద‌రి, ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది జైలు అధికారుల‌పై న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. ఇటీవ‌ల క్రిస్‌మ‌స్ పండ‌గ సంద‌ర్భంగా జైలులో ఉన్న డేసీ లింక్ (28) త‌న కుటుంబంతో జైలు నుంచే మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా తాను ఇప్పుడు క‌నీసం నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తినని వారికి వెల్ల‌డించింది. ‘మా సోద‌రి అలా చెప్ప‌గానే నాకు మాట‌లు రాలేదు. ముందు అస‌లు ఆ మాట‌ల‌ను మేము న‌మ్మ‌లేదు. అది నిజ‌మ‌ని తెలియ‌గానే ఆ జైలులో త‌న భ‌ద్ర‌త‌పై నాకు భ‌యం వేసింది’ అని డేసీ సోద‌రి క్రిస్ట‌ల్ బారెటో మీడియాకు వెల్ల‌డించారు.


హ‌త్య చేసింద‌నే ఆర‌ప‌ణ‌పై డేసీని జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై కోర్టు విచార‌ణ ఇంకా జ‌ర‌గాల్సి ఉంది. త‌న భాగ‌స్వామి ప్ర‌వ‌ర్త‌న మితిమీర‌డంతో ప్రాణ ర‌క్ష‌ణ నిమిత్తం మాత్ర‌మే హ‌త్య చేయాల్సి వ‌చ్చింద‌ని డేసీ త‌ర‌ఫు న్యాయ‌వాది చెబుతున్నారు. తుపాకీతో సింగిల్ షాట్ బుల్లెట్‌తో డేసీ త‌న భాగ‌స్వామిని హ‌త్య చేసిన‌ట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు త‌మ క్ల‌యింట్ గ‌ర్భంతో ఉన్నందున‌, అలాగే ఆమె భ‌ద్ర‌త‌పై అనుమానాలు ఉన్నందున త‌న‌ను హౌస్ అరెస్టుకు అనుమ‌తి ఇవ్వాల‌ని న్యాయ‌వాది, సోద‌రి కోరుతున్నారు. అయితే ఆ గ‌ర్భం ఎవ‌రి వ‌ల్ల వ‌చ్చింది.. అత్యాచారం ఏమైనా జ‌రిగిందా అనే అంశాల‌ను డేసీ త‌మ‌కు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని వారు వెల్ల‌డించారు.


‘ డేసీ అప్పుడ‌ప్పుడూ అక్క‌డి నుంచి ఇక్క‌డి నుంచి మాకు ఫోన్ చేసి ఈ విష‌యం చెప్పింది. పూర్తి వివ‌రాల‌ను త‌ను చెప్ప‌లేదు. ఎందుకంటే జైలులో ఫోన్ల‌న్నీ రికార్డ‌వుతుంటాయి’ అని బారెటో చెప్పుకొచ్చింది. ఖైదీల్లో మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు వేర్వేరు బ‌రాక్‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డింది తోటి ఖైదీనేన‌ని త‌మ‌కు స‌మాచ‌రం ఉంద‌ని తెలిపింది. మ‌రోవైపు ఈ వార్త‌ను కౌంటీ జైలు ధ్రువీక‌రించింది. బాధితురాలికి పూర్తి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని..ఆమె గ‌ర్భంతో ఉన్నార‌ని వెల్ల‌డించింది. అయితే ఆమెపై జైలులో ఎటువంటి అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని.. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ఒక‌ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.