అఫ్గాన్‌లో మారణహోమం.. భూకంపం ధాటికి 2000 మంది మృతి

విధాత: పశ్చిమ అఫ్గానిస్థాన్ (Afghanistan) లో సంభవించిన భూ కంపం తీవ్రత ఇప్పుడిప్పుడే బయటకు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ఏర్పడిన ఈ భూ కంపం (Earth Quake) ధాటికి కనీసం 1000 మంది మరణించారని తాలిబన్ పాలకులు అధికారికంగా ప్రకటించారు. అయితే మరణాల సంఖ్య 2000ను దాటేసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక తాలిబన్ అధికారి మీడియాకు తెలిపారు. గ్రామాలకు గ్రామాలు.. శిథిలాల కింద చిక్కుకుపోవడంతో వాటిని తొలగించి చిక్కుకున్నవారిని, మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రావిన్షియల్ రాజధాని అయిన హెరాత్ నుంచి 30 కి.మీ. దూరంలో భూ కంప కేంద్రం నమోదైంది. శనివారం రాత్రి తొలిసారి ప్రకంపనలు రాగా.. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి పరుగులు పెట్టారు. మొత్తం 5 గంటల పాటు ఈ కంపనలు కొనసాగాయని, పలు ఇళ్లు, కార్యాలయాలు, భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఈ ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పలు కుటుంబాలు తమ సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా ప్రకారం.. 600కు పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 12 గ్రామాలు భూకంపానికి కకావికలం కాగా.. 4200 మందిపై నేరుగా ఈ ప్రభావం పడింది.
‘తొలి కంపనాలు శనివారం మధ్యాహ్నమే ప్రారంభమై అలా పెరుగుతూ పోయాయి. మేం బయటకు వచ్చి చూస్తే మొత్తం ఎడారిలా మారిపోయింది’ అని నెక్ మహమ్మద్ అనే స్థానికుడు వాపోయాడు. తాలిబన్ పాలన, కరవు పరిస్థితులతో సతమతమవుతున్న హెరాత్ ప్రాంతంలో భూకంపం మరిన్ని కష్టాలకు కారణమవుతుందని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.