Bangladesh curfew | బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. దేశమంతటా కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
Bangladesh curfew | స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 30 శాతం రిజర్వేషన్‌లను తొలగించాలంటూ బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో రిజర్వేషన్ల వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Bangladesh curfew : స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 30 శాతం రిజర్వేషన్‌లను తొలగించాలంటూ బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో రిజర్వేషన్ల వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు. శుక్రవారం నాటికి పరిస్థితి పూర్తిగా హింసాత్మకంగా మారిపోయింది.
శుక్రవారం ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు, బాష్పవాయు గోళాలను, రబ్బర్ బుల్లెట్లను, పెద్ద శబ్దాలు చేసే గ్రనేడ్లను ప్రయోగించారు. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. దాంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించింది. ఢాకాలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. అన్ని రకాల సభలు, ప్రదర్శనలను నిషేధించారు.
బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. దీన్ని ఆ దేశ అంతర్గత విషయంగా తాము పరిగణిస్తున్నట్లు పేర్కొంది. 8,000 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు బంగ్లాదేశ్‌లో ఉన్నారని, వారంతా క్షేమమని వెల్లడించింది. వారికి సాధ్యమైనంత సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. దీనికోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పింది.