అమెరికాలో 2 లక్షల ఎకరాలను కొనుగోలు చేసిన చైనా బిలియనీర్
అమెరికా (America) లోని వ్యవసాయ క్షేత్రాన్ని చైనా (China) అధికార పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) సభ్యుడు కొనడంపై భారీ ఎత్తున నిరసనలు

అమెరికా (America) లోని వ్యవసాయ క్షేత్రాన్ని చైనా (China) అధికార పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) సభ్యుడు కొనడంపై భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి కాదు రెండు ఏకంగా రెండు లక్షల ఎకరాల ఏక వ్యవసాయ క్షేత్రాన్ని సీసీపీ సభ్యుడు చెన్ టియాంక్విఓ కొనుగోలు చేశారు. 2015లో ఈ కొనుగోలు జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భూమిని కొనుగోలు చేయడం ద్వారా అమెరికాలో అత్యంత పెద్దదైన వ్యవసాయ క్షేత్రం కలిగి ఉన్న రెండో విదేశీ వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు. సైనికపరంగా, దౌత్యపరంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు అంత సరిగా లేని ఈ సమయంలో పొలం విషం బయటకు పొక్కడం విశేషం. పైగా ఈ వ్యవహారంపై అమెరికాలోని రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌లు ఇద్దరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశ వ్యవసాయ క్షేత్రాలను, విలువైన భూములను విదేశీయుల నుంచి కాపాడటంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని రిపబ్లిక్ పార్టీకి చెందిన ఎలిసే స్టెఫానిక్ విమర్శించారు. కమ్యూనిస్ట్ చైనా.. అమెరికాలో భూములను కొంటూ పోతోంది. ఇది మన సార్వభౌమత్వానికి అత్యంత హానికరం. సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాల సమీపంలో వారి భూములు ఉంటున్నాయి అని స్టెఫానిక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చెన్ కొనుగోలు ప్రభుత్వ రికార్డుల్లో కనిపించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఒక విదేశీయుడు అమెరికాలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాక.. అందులో వ్యవసాయేతర పని ఏదైనా చేపట్టాలనుకుంటేనే ప్రభుత్వ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకోవాలి. లేదంటే అసలు ఈ కొనుగోలు గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అగ్రికల్చర్ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్‌క్లోజర్ చట్టంలోని ఈ లొసుగును ఆధారం చేసుకునే చాలా మంది చైనీయులు ఇక్కడ భారీ స్థాయిలో వ్యవసాయ భూములను కొనేస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఇంత పెద్ద మొత్తంలో భూమి కొనుగోలు చేసిన ఆ చెన్ టియాంక్విఓ ఎవరనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. షండా ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ వ్యవస్థాపకుడే చిన్. 1999లో ఈ సంస్థను స్థాపించి అతడు అయిదేళ్లకే దానిని అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. అమెరికాలో 10 లక్షల ఎకరాలున్న ఓ కెనడా వ్యక్తి తర్వాత ఆ స్థాయిలో భూమి ఉన్నది చెన్‌కే. అతడు ఎకరం సుమారు రూ.35 వేలు (430 డాలర్లు) వెచ్చించి 2 లక్షల ఎకరాలు కొన్నట్లు తెలుస్తోంది.