త‌ల‌పై ప‌నిముట్టుతో క‌సితీరా కొట్టి, యువ‌తును ఉరివేసి.. వెలుగులోకి హ‌మాస్ అకృత్యాలు

  • Publish Date - October 24, 2023 / 01:52 PM IST

  • రా ఫుటేజ్ విడుద‌ల చేసిన ఇజ్రాయెల్‌
  • చ‌నిపోయిన హ‌మాస్ స‌భ్యుల మృత‌దేహాల నుంచి సేక‌ర‌ణ‌
  • ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టిస్తున్న ఫ్రాన్స్ అధ్య‌క్షుడు

ఇజ్రాయెల్ (Israel Conflict) లోకి చొర‌బ‌డి అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న హ‌మాస్ అకృత్యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ఆ దేశం సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటోంది. అక్టోబ‌ర్ 7న జ‌రిగిన ఆ హింస‌కు సంబంధించి హ‌మాస్ ఉగ్ర‌వాదులు పెట్టుకున్న బాడీ కెమేరాల ఫుటేజీల‌ను విడుద‌ల చేసింది. చ‌నిపోయిన హ‌మాస్ స‌భ్యుల మృతదేహాల నుంచి వీటిని సేక‌రించామ‌ని చెప్పింది. అయితే ఘోరాతి ఘోరంగా ఉన్న ఈ ఫుటేజీను బ‌హిరంగంగా విడుద‌ల చేయ‌బోమ‌ని.. నిజాల‌ను రిపోర్టు చేయాల‌నుకునే జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేక స్క్రీనింగ్ వేసామ‌ని తెలిపింది. వారు ఆ దారుణాల‌ను ప్ర‌చురించాల‌ని ఇజ్రాయెల్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఈ ఫుటేజీని చూసిన ఫాక్స్ న్యూస్ దీనిపై ఒక‌ క‌థ‌నాన్ని వెలువ‌రించింది. హ‌మాస్ స‌భ్యులు యువ‌తిని ఉరి తీయ‌డం, కారులో వెళుతున్న ఇజ్రాయేలీయుల‌ను కాల్చేయ‌డం, ఇళ్ల‌ల్లోకి గ్ర‌నైడ్లు విస‌రడం, దాడుల్లో ఒక వ్య‌క్తి, ఆయ‌న ఇద్ద‌రు చిన్నారులు చ‌నిపోవ‌డం వంటి ఘ‌ట‌నలున్నాయి. ర‌క్తం మ‌డుగులో ప‌డిపోయిన ఒక వ్య‌క్తి వ‌ద్ద నాన్న చ‌నిపోయాడు. ఇది ప్రాంక్ (క‌ల్పితం) కాదు అంటూ విల‌పించాడు. అవును నేను చూశాను.. మ‌న‌మెందుకు బ‌తికున్నాం అని అత‌డి సోద‌రుడు అంటున్న‌ట్లు రా ఫుటేజీలో ఉంద‌ని ఫాక్స్ న్యూస్ ఆ ఘోరాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టింది. మ‌రో ఫుటేజీలో ఒక పౌరుడి త‌ల‌ను వ్య‌వ‌సాయ ప‌నిముట్టుతో క‌సితీరా కొట్టి చంపిన‌ట్లు రికార్డ‌యింది. నేను 10 మంది యూదులను చంపేశాను. ఇప్పుడు నా చేతిలో చ‌నిపోయిన ఒక యూదు యువ‌తి ఫోన్‌తో మాట్లాడుతున్నా అంటూ ఒక ఉగ్ర‌వాది త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో సంభాషిస్తున్న‌ట్లు రికార్డ‌యింది.

ఇజ్రాయెల్‌లో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు

ఇజ్రాయెల్‌- హ‌మాస్‌ల మ‌ధ్య పోరు 18వ రోజుకు చేరుకుంది. సోమ‌వారం రాత్రి గాజాపై జ‌రిగిన దాడుల్లో 140 మంది మ‌ర‌ణించార‌ని హ‌మాస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మ‌రో ఇద్ద‌రు విదేశీ బందీల‌ను విడిచిపెట్టామ‌ని వారు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఇజ్రాయెల్ దీనిని ఇంకా ధ్రువీక‌రించాల్సి ఉంది. హ‌మాస్ ఉగ్ర‌వాదుల వ‌ద్ద బందీలుగా ఉన్న వారి సంఖ్య‌ను ఇజ్రాయెల్ సోమ‌వారం రెట్టింపు చేసింది. తొలుత 150 మందిని హ‌మాస్ స‌భ్యులు కిడ్నాప్ చేశార‌ని చెప్పిన‌ప్ప‌టికీ తాజాగా ఆ 222 మంది అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌పై జ‌రిగిన దాడిలో త‌మ పౌరుల మృతిపై యూకే తొలిసారి స్పందించింది. త‌మ వారు 10 మంది హ‌మాస్ బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ టెల్ అవీవ్‌కు మంగ‌ళ‌వారం చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపి, మ‌ద్ద‌తుగా నిల‌వ‌డానికే ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మతో క‌లిసి ప‌నిచేస్తున్న ఆరుగురు వాలంటీర్లు కాల్పుల‌కు గురై మ‌ర‌ణించిన‌ట్లు గాజాలోని యూఎన్ పాల‌స్తీనా శ‌ర‌ణార్థుల ఏజెన్సీ వెల్ల‌డించింది.

ప్రపంచ ఆర్థికవ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం..

మ‌ధ్య ప్రాచ్యంలో ఏర్ప‌డిన ఈ సంక్షోభం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావాన్ని చూపుతోంది. బంగారం రేట్లు అసాధార‌ణ రీతిలో పెర‌గ‌గ‌డ ప్రారంభించాయి. పెట్టుబడిదారులు అతి జాగ్ర‌త్త పాటిస్తూ.. యుద్ధాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని ఆర్థిక‌వేత్త‌లు చెబుతున్నారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వస్థకు చోద‌కంగా ప‌నిచేసే చ‌మురు ధ‌ర‌లూ పెర‌గ‌డం ప్రారంభించాయి. మొన్న‌మొన్న‌టి వ‌ర‌కు చ‌మురు ధ‌ర‌లు కాస్త త‌క్కువ‌గా ఉండ‌టంతో.. ఆ న‌ష్టాల‌ను పూడ్చుకోవ‌డానికి వ్యాపార‌వ‌ర్గాలు ధ‌ర‌ను కృత్రిమంగా పెంచేస్తున్నాయి. యుద్ధం విస్త‌రించే అవ‌కాశం ఉండ‌టంతో చ‌మురు ఎగుమ‌తి దేశాల్లో ఉత్పత్తి ప‌డిపోయే అవ‌కాశ‌మూ ఉంద‌ని వారు అంటున్నారు.

Latest News