జూమ్ సమావేశాలను మెదడు అర్థం చేసుకోలేకపోతోంది.. వెల్లడించిన అధ్యయనం

కొవిడ్ (Covid) తదనంతర కాలంలో ఆఫీస్ సమావేశాలు.. ఆ మాటకొస్తే మనుషులు మాట్లాడుకునే విధానమే మారిపోయింది. నేరుగా కలుసుకునే అవకాశం ఉన్నా జూమ్ (Zoom) , టీమ్స్ (Teams) ఫ్లాట్‌ఫాంలలోనే కలుసుకోవడం ఎక్కువైంది. అయితే ఇలా ఆన్‌లైన్ వేదికల్లో వీడియోల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మన మెదడు దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతోందని ఒక అధ్యయనం (Study) స్పష్టం చేస్తోంది. ఇలాంటి సంభాషణలను విశ్లేషించుకుని అర్థం చేసుకోవడంలో మెదడు తడబడుతోందని తెలిపింది. నేరుగా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినపుడుతో పోలిస్తే.. ఆన్‌లైన్ సమావేశాల్లో మెదడు స్పందనలు అంతంతమాత్రమేనని విశ్లేషించింది.
సంభాషణలకు స్పందించే మెదడులోని భాగాలు వ్యక్తులను నేరుగా కలుసుకున్నపుడు బాగా ఉత్తేజితం కావడమే దీనికి కారణం. ఇప్పుడున్న టెక్నాలజీ వరకు చూసుకుంటే వీడియో ఎంత క్వాలిటీగా ఉన్నా అది మెదడును అసలైన దానిలాగ భ్రమింపజేయలేకపోతోంది అని న్యూరో శాస్త్రవేత్త జాయ్ హిర్స్క్ అన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు వివిధ దేశాలు, జెండర్ల నుంచి ఎంపిక చేసిన 28 మంది యువతీ యువకులపై అధ్యయనం చేశారు.
ఇందులో భాగంగా వారు ఇతరులతో వారు ఎలా సంభాషిస్తున్నారో అప్పటికప్పుడు పరిశీలించారు. దీని కోసం ఫంక్షనల్ నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, ఐ ట్రాకర్స్ అండ్ ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ సాంకేతికతలను ఉపయోగించి వారి కంటి చూపు, మెదడు స్పందనలను రికార్డు చేసుకున్నారు. ఇలా కొంత మంది జంటలను నేరుగా మాట్లాడుకోమని.. మరి కొన్ని జంటలను వీడియో చాట్ చేసుకోమని చెప్పి.. రెండు గ్రూపుల అధ్యయన వివరాలను పోల్చి చూశారు. ఆ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. నేరుగా మాట్లాడుకున్న వారితో పోలిస్తే.. వీడియో చాట్‌లో మట్లాడుకున్న వారి బ్రెయిన్‌లో డోర్సల్ పారియేటల్ ప్రాంతం అంతగా స్పందించలేదని అర్థమైంది.
మెదడులోని ఈ భాగమే సంభాషణలను ఆకళింపు చేసుకోవడానికి సాయపడుతుంది. అంతే కాకుండా కంటిలోని ప్యూపిల్ అనే భాగం ప్రత్యక్ష సమావేశాల్లో బాగా విస్తరిస్తోందని.. దాని వల్ల మెదడుకు ఏకాగ్రత పెరుగుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిణామాలేవీ జూమ్, టీమ్స్ వంటి ఆన్‌లైన్ సమావేశాలప్పుడు జరగడం లేదని స్పష్టం చేశారు. అందుకే ఈ తరహా మీటింగ్‌ల వల్ల ఉత్పాదకత తక్కువవుతందోనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.