వ‌దిలేమ‌ని వేడుకుంటున్నా లాక్కెళ్లి పోయారు.. క‌న్నీరు పెట్టిస్తున్న ఇజ్రాయెల్ యువ‌తి వీడియో

వ‌దిలేమ‌ని వేడుకుంటున్నా లాక్కెళ్లి పోయారు.. క‌న్నీరు పెట్టిస్తున్న ఇజ్రాయెల్ యువ‌తి వీడియో

విధాత‌: ఇజ్రాయెల్ (Israel) పౌరుల‌పై హ‌మాస్ ద‌ళ స‌భ్యులు చేస్తున్న అరాచ‌కాల వీడియోలు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. తాజాగా త‌న‌ను వదిలేయాల‌ని ప్రాధేయ‌ప‌డుతున్న 25 ఏళ్ల యువ‌తిని బండికి క‌ట్టేసి లాక్కెళిపోతున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. త‌న స్నేహితుడితో క‌లిసి పీస్ మ్యూజిక్ అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నోవా అర్గామ‌ని అనే యువ‌తిని హమాస్ ద‌ళాలు కిడ్నాప్ చేశాయి. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన ప్రాంతం ఇజ్రాయెల్‌లో ఉండ‌గా వీరిని కిడ్నాప్ చేసి గాజా ప్రాంతంలోకి లాక్కెళ్లిపోయారు.


ఈ క్ర‌మంలో ఆమె త‌న‌ను చంపొద్దంటూ హ‌మాస్ ద‌ళాల‌ను వేడుకుంటున్న దృశ్యం కంట‌త‌డి పెట్టిస్తోంది. త‌న బాయ్ ఫ్రెండ్‌ను కూడా వారు త‌మ అధీనంలోకి తీసుకున్న‌ట్లు వీడియోలో ఉండ‌గా.. ప్ర‌స్తుతం అత‌డి జాడ తెలియ‌డం లేదు. అత‌డి ప్రాణాల‌ను తీసేసి ఉండొచ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. పీస్ మ్యూజిక్లో పాల్గొన్న నోవాను హమాస్ ద‌ళాలు గాజాలోకి ఈడ్చుకుపోయాయి. త‌ను మీ అక్క, చెల్లి, కుమార్తె ఎవ‌రైనా కావొచ్చు అని ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసిన హెన్ మ్యాజింగ్ వ్యాఖ్యానించాడు.


ఈ వీడియోను చూసి నోవా, ఆమె స్నేహితుడి త‌ల్లిదండ్రులు కుప్ప‌కూలిపోయారు. త‌మ కుమార్తె వ‌దిలేయ‌మ‌ని ప్రాథేయ‌ప‌డుతున్నా.. ఆ దుండ‌గులు వ‌ద‌ల‌లేద‌ని విల‌పిస్తున్నారు. నోవా పాల్గొన్న సంగీత కార్య‌క్రమానికి హాజ‌రైన మ‌రికొంద‌రి ఆచూకీ కూడా ఇప్ప‌టికీ తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం ఉద‌యం గాజా నుంచి దూసుకొచ్చిన రాకెట్ల ధాటికీ వీరు త‌లో దిక్కుకు పారిపోయారు. ఆ త‌ర్వాత ఎవ‌రు ఏమ‌య్యారనేది ఎవ‌రికీ తెలియ‌ద‌ని కొంత మంది సాక్షులు పేర్కొన్నారు.