బోయింగ్ విమానాల్లో లూజుగా బోల్టు.. భార‌త విమానయాన సంస్థల‌కు హై అల‌ర్ట్

అమెరికా సంస్థ బోయింగ్ (Boeing) రూపొందించిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఒక బోల్టు కాస్త వ‌దులుగా ఉంద‌న్న నివేదిక‌తో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది.

బోయింగ్ విమానాల్లో లూజుగా బోల్టు.. భార‌త విమానయాన సంస్థల‌కు హై అల‌ర్ట్

అమెరికా సంస్థ బోయింగ్ (Boeing) రూపొందించిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఒక బోల్టు కాస్త వ‌దులుగా ఉంద‌న్న నివేదిక‌తో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. ఆ విమానాల‌ను కొనుగోలు చేసిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్ జెట్‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్న‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌లో రాజీ లేకుండా ఉండేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. బోయింగ్ 737 మ్యాక్స్ (737 MAX) మోడ‌ళ్ల‌లో ఎంపిక చేసిన విమానాల‌ను ఆడిట్ చేస్తున్న‌పుడు విమానం ర‌డ్డ‌ర్ కంట్రోల్ సిస్టంలో ఒక బోల్టు లూజ్‌గా ఉన్న‌ట్లు గుర్తించామ‌ని యూఎస్ ఫెడ‌రేష‌న్ ఏవియేష‌న్ వెల్ల‌డించింది. దీంతో ఆయా విమానాల్లో ఈ స‌మ‌స్య‌ను స‌రిచేసిన బోయింగ్‌..




త‌మ వినియోగ‌దారులందరినీ దీనిపై స‌మీక్ష చేయాల్సిందిగా సూచించింది. యూఎస్ ఫెడ‌రేష‌న్ ఏవియేష‌న్‌, బోయింగ్‌ల‌తో తాము నిరంతరం చ‌ర్చిస్తున్నామ‌ని డీజీసీయే తెలిపింది. బోయింగ్ మ్యాక్స్ 737లో ఒక చిన్న లోపం ఉంది. విమానాల్లో ఏదైనా స‌మ‌స్య ఉన్న‌పుడు బోయింగ్ ఇలా సూచ‌న‌లు ఇస్తూ ఉంటుంది. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌మ‌కు బోయింగ్ నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు వ‌చ్చిన‌ట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ బోల్టు స‌మ‌స్య త‌మ‌కు రాలేద‌ని.. అయినా నిరంత‌రం ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.




బోయింగ్ సూచ‌న‌ల మేర‌కు త‌మ ద‌గ్గ‌ర ఉన్న మ్యాక్స్ 737.. 8 విమానాల‌ను ఆడిట్ చేస్తున్నామ‌ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్ల‌డించింది. త‌మ స‌ర్వీసులు య‌థావిధిగా కొన‌సాగుతున్నాయ‌ని స్పైస్ జెట్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. త‌క్కువ కాలంలో ఎక్కువ సంఖ్య‌లో అమ్ముడుపోయిన మోడ‌ల్‌గా 737 మ్యాక్స్ రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇండోనేసియా, జ‌కార్తాల్లో ఈ విమానాలు కూలిపోవ‌డం.. 356 మంది మృత్యువాత ప‌డ‌టంతో ఈ విమానాలు ఎగ‌ర‌కుండా నిషేధం విధించారు. సాంకేతిక అవ‌రోధాల‌ను దాటుకుని 2021లో వీటికి మ‌ళ్లీ అనుమ‌తి ల‌భించింది.