Iran: పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్‌ పోర్ట్‌.. 520 మందికి గాయాలు? (వీడియో)

Iran: పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్‌ పోర్ట్‌.. 520 మందికి గాయాలు? (వీడియో)

ఇరాన్‌లో దారుణం చోటుచేసుకున్నది. బందర్‌అబ్బాస్‌ సమీపంలోని షహీద్‌ రజాయీ పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 520 మంది గాయపడి ఉంటారని అంచనా. మృతుల సంఖ్యపై ఇప్పటి వరకూ వివరాలు అందలేదు. ఈ ఘటనలో పోర్టులో ఉన్న అనేక కంటెయినర్లు పేలిపోయాయి. ఒక్కసారిగా పోర్టును భారీ అగ్నికీలలు, దట్టమైన నల్లని పొగ కమ్మేశాయి. ఇరాన్‌లోని అత్యంత అడ్వాన్స్‌డ్‌ పోర్టుల్లో ఇదొకటి.

మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని రీజినల్‌ పోర్ట్‌ అధికారి ఎస్మాయిల్ మలేకిజాదే వార్తా సంస్థలకు తెలిపారు. షహీద్‌ రజాయీ పోర్టు.. దేశ రాజధాని టెహరాన్‌కు దక్షిణంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్‌లోని అత్యంత అధునాతన కంటెయినర్‌ పోర్ట్‌ ఇది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఐదోవంతు ఈ పోర్టు ద్వారానే రవాణా అవుతుంది.

పలు కంటెయినర్లు పేలిపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. గాయపడినవారిని సమీప హాస్పిటల్స్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నాయి. అతిపెద్ద చమురు ఎగమతి స్థలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.