ఏడు గ్ర‌హాల సౌర‌వ్య‌వ‌స్థ‌ను క‌నుగొన్న నాసా

ఏడు గ్ర‌హాల సౌర‌వ్య‌వ‌స్థ‌ను క‌నుగొన్న నాసా

ఈ సుదీర్ఘ అంత‌రిక్షంలో కొత్త కొత్త గ్ర‌హాల‌ను క‌నుక్కోవ‌డానికి నాసా (NASA) గ‌తంలో కెప్ల‌ర్ (Kepler) టెలిస్కోప్‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. దాని జీవిత కాలం ముగియ‌డంతో అది రిటైర్ అయిపోయిన‌ప్ప‌టికీ.. కెప్ల‌ర్ పంపిన స‌మాచారంతో శాస్త్రవేత్త‌లు కొత్త కొత్త విష‌యాల‌ను క‌నుగొంటూనే ఉన్నారు. తాజాగా కెప్ల‌ర్ స‌మాచారాన్ని విశ్లేషించిన ప‌రిశోధ‌కులు.. మ‌న‌కు సూదూరాన ఏడు గ్ర‌హాల‌తో కూడిన ఒక సౌర వ్య‌వ‌స్థ‌ను గుర్తించారు.


ఈ వ్య‌వ‌స్థ‌కు కెప్ల‌ర్ – 385 అని పేరు పెట్టారు. ఇందులో ఉన్న గ్ర‌హాలు భూమి కంటే కాస్త పెద్ద‌వి. నెప్ట్యూన్ కంటే చిన్న‌వి. వాటి మ‌ధ్య‌లో ఉన్న సూర్యుని నుంచి అతి పెద్ద మొత్తంలో అవి ఉష్ణాన్ని స్వీక‌రిస్తున్నాయి. ఇది మ‌న సౌర కుటుంబంలో ఏ గ్ర‌హం ఉష్ణోగ్ర‌త‌తో పోల్చి చూసినా ఎక్కువే. సూర్యుని ద‌గ్గ‌ర‌గా ఉండే తొలి రెండు గ్ర‌హాలు భూమి కంటే కాస్త పెద్ద‌వి కాగా.. మిగిలిన నాలుగూ చాలా పెద్ద‌వ‌ని తెలుస్తోంది. వారి సూర్యుడు కూడా మ‌న సూర్యుడి కంటే 10 శాతం ఎక్కువ విస్తీర్ణం, 5 శాతం ఎక్కువ ఉష్ణాన్ని వెలువ‌రిస్తున్నారు.


చిన్న చిన్న గ్ర‌హ వ్య‌వ‌స్థ‌లను ఇప్ప‌టికే చాలా వాటిని క‌నుగొన్నా.. ఆరు అంత కంటే ఎక్కువ గ్ర‌హాలున్న సౌర కుటుంబాల గురించి తెలియ‌డం చాలా అరుద‌ని నాసా త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కెప్ల‌ర్ ద్వారా 700 సౌర వ్య‌వ‌స్థ‌ల‌ను, 4400 గ్ర‌హాల‌ను క‌నుగొన్నామ‌ని తెలిపింది. ఈ వివ‌రాలు భ‌విష్య‌త్తు అంతరిక్ష ప్ర‌యోగాల‌కు చాలా బాగా ఉపయోగ‌ప‌డతాయ‌ని నాసాకు చెందిన అమెస్ రీస‌ర్చ్ సెంట‌ర్ ప‌రిశోధ‌కుడు జాక్ లిసాయ‌ర్ వివ‌రించారు.