అమెరికాలోని చైనా దౌత్య కార్యాల‌యంలోకి దూసుకెళ్లిన కారు

  • Publish Date - October 10, 2023 / 07:59 AM IST

  • అడ్మినిస్ట్రేషన్ హాల్‌లోకి చొర‌బాటు
  • అగంత‌కుడిని కాల్చి చంపిన పోలీసులు

విధాత‌: అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనా దౌత్య కార్యాల‌యంలోకి సోమవారం ఓ కారు ప్రమాద‌క‌రంగా దూసుకొచ్చింది. ప్ర‌వేశ ద్వారం అద్దాలు ప‌గుల‌కొట్టుకొని అడ్మినిస్ట్రేషన్ హాల్‌లోకి కారును న‌డిపిన అంగ‌త‌కుడి భద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న కాన్సులేట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. అగంత‌కుడు ఆయుధాల‌ను డోరు వైపు చూపుతున్న‌ట్టు, ప్రజలు భ‌యాందోళ‌న‌తో మెట్లు దిగి బ‌య‌ట‌కు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ‌య్యాయి.


“మా కాన్సులేట్ అడ్మినిస్ట్రేషన్ హాల్‌లోకి హింసాత్మకంగా కారుతో దూసుకొచ్చాడు. ఇది మా సిబ్బంది ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుంద‌ని భావించి భ‌ద్రతా సిబ్బంది అనుమానితుడిపై కాల్పులు జ‌రిపారు” అని కాన్సులేట్ ప్రతినిధి తెలిపారు.


అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది అనుమానితుడి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించిన‌ప్ప‌టికీ తీవ్ర‌ర‌క్త స్రావం కావ‌డంతో ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ చ‌నిపోయిన‌ట్టు పేర్కొన్నారు. నిందితుడు ఎవ‌రు? ఎందుకు దౌత్య కార్యాల‌యంపై దాడికి య‌త్నించాడు? అనే వివ‌రాలను అధికారులు వెల్ల‌డించ‌లేదు. ఈ హింసాత్మ‌క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, బాధ్యుల‌ను గుర్తించి చ‌ర్య‌లు చేప‌డతామ‌ని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చైనా జాతీయులు పెద్ద సంఖ్య‌లో నివాసం ఉంటున్నారు.

Latest News