ఓజోన్ పొర‌కు భారీ రంధ్రం.. ఆ అగ్నిప‌ర్వ‌త‌మే కార‌ణం!

  • Publish Date - October 7, 2023 / 08:52 AM IST

విధాత‌: చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత స్థాయిలో అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ పొర (Ozone Layer) రంధ్రం ప‌రిమాణం భారీగా పెరిగిపోయింది. యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కు చెందిన సెంటిన‌ల్ 5పి ఉప‌గ్ర‌హం ఓజోన్ చిత్రాల‌ను తీయ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. 2023, సెప్టెంబ‌రు 16 నాటికి అంటార్కిటికా ఓజోన్ రంధ్రం 26 మిలియ‌న్ స్క్వేర్ కి.మీ.కు విస్త‌రించిన‌ట్లు శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు.


కాగా.. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 2022 మొద‌ట్లో టోంగా తీరంలో స‌ముద్రం అడుగున బ‌ద్ద‌లైన అగ్నిప‌ర్వ‌తం వ‌ల్లే ఈ రంధ్రం పెరిగింది. అప్పుడు విడుద‌లైన బూడిద‌, విష వాయువులు అంటార్కిటికాపై ఓజోన్ ప‌ల‌చ‌బ‌డ‌టానికి, అక్క‌డి రంధ్రం పెరిగిపోవ‌డానికి కార‌ణమ‌ని తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల‌ను ప‌రిశీలించ‌గా హంగా టోంగా హుంగా హాపై అగ్నిప‌ర్వ‌తం వెద‌జ‌ల్లిన బూడిద భూమిపై చాలా ఎత్తు వ‌ర‌కు విస్త‌రించింద‌ని తెలిసింది.


ఏటా ఏర్ప‌డే తాత్కాలిక ఓజోన్ రంధ్రాల్లో ప్ర‌స్తుతం ఏర్ప‌డిన దానిని అత్యంత పెద్ద‌దిగా భావిస్తున్నారు. రెండు ద‌శాబ్దాల క్రితం 2000 వ సంవత్స‌రంలో 28.4మిలియ‌న్ చ‌.కి.మీ. వైశాల్యంతో ఏర్ప‌డిన ఖాళీనే ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద ఓజోన్ రంధ్రంగా రికార్డుల్లో ఉంది. ఓజోన్ డిప్లెష‌న్ ఏరియాగా పిలిచే ఈ ఖాళీ ప్ర‌స్తుతం మూడు బ్రెజిల్ దేశాల విస్తీర్ణం కంటే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.


అయితే ఈ రంధ్రం అనేది శాశ్వ‌తంగా ఉండ‌దు. వాతావ‌ర‌ణ మార్పుల‌న‌నుస‌రించి డిసెంబ‌రు నాటికి ఇది య‌థాత‌థ స్థితికి రావొచ్చ‌ని శాస్త్రవేత్త‌లు తెలిపారు. ఆగ‌స్టు నుంచి అక్టోబ‌రు వ‌ర‌కు ఓజోన్ ప‌లుచ‌బ‌డ‌టం, డిసెంబ‌రు నుంచి త‌న‌ను తాను పున‌రుద్ధ‌రించుకుని య‌థాస్థితికి రావ‌డం ఎప్పుడూ జ‌రిగేదే. అయితే ఈ స్థాయిలో రంధ్రం ఏర్ప‌డ‌ట‌మ‌నేది ఈ మ‌ధ్య కాలంలో ఇదే తొలిసారి.


భూమిపై వివిధ వాతావ‌ర‌ణ పొర‌లు ఉంటాయ‌ని మ‌న‌కు తెలిసిందే. స్ట్రాటోఆవ‌ర‌ణంలో ఉన్న ఓజోన్.. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల‌ను శోషించుకుని భూమిపైకి రాకుండా కాపాడుతుంది. ఇది ప‌లుచ‌బ‌డితే భూమిపై ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డంతో పాటు .. అతినీల‌లోహిత కిర‌ణాల కార‌ణంగా మ‌నుషులు చ‌ర్మ కేన్స‌ర్ బారిన ప‌డే ప్ర‌మాద‌ముంది.

Latest News