గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన పుతిన్’ వార్తలో నిజమెంత?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తూ ఉంటాయి. కొంత మంది వాటిని వదంతులు అనే కొట్టిపారేస్తుండగా.. మరికొందరు నిజమేనని నమ్ముతారు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తూ ఉంటాయి. కొంత మంది వాటిని వదంతులు అనే కొట్టిపారేస్తుండగా.. మరికొందరు నిజమేనని నమ్ముతారు. తాజాగా అలాంటిదే ఒక వార్త టెలిగ్రామ్ లోని ఒక న్యూస్ ఛానెల్‌లో చక్కర్లు కొడుతోంది. గత ఆదివారం పుతిన్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చి తన గదిలో కుప్పకూలిపోయారనేది ఆ వార్త. ఆయన కళ్లు తేలేసిన స్థితిలో.. భద్రతా సిబ్బంది గుర్తించి వైద్యులు పిలిచారని, వారు పుతిన్ నివాసంలోనే ఉన్న ఒక ఐసీయూలో చికిత్సకు ఏర్పాట్లు చేసినట్లు అందులో ఉంది.
ఒక రష్యన్ మాజీ సైనికాధికారి నడిపిస్తున్నారని చెప్పే ఆ టెలిగ్రాం ఛానల్ పేరు జనరల్ ఎస్వీఆర్. ఈ ఛానల్‌లో గతంలోనూ పుతిన్ ఆరోగ్యంపై వార్తలు రాగా.. తర్వాతి కాలంలో అవి చాలా మటుకు వదంతులని తేలాయి. అయితే పాశ్చాత్య మీడియా మాత్రం ఈ ఛానల్‌లో వచ్చే వార్తలకు అమిత ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. పుతిన్ పడిపోయిన శబ్దానికి అతడి వ్యక్తిగత సిబ్బంది లోపలకి వచ్చి చూడగా.. ఆయన గుండెపోటుతో విలవిల్లాడుతున్నారని ఆ ఛానల్‌లో వార్త వచ్చింది.
ఆ గదిలోని ఆహారం, డ్రింక్ గ్లాసులన్నీ చిందరవందరగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. ఇదే ఛానల్ గతంలో ఒక సంచలన, నమశక్యంకాని ప్రకటన చేసింది. ఇటీవల చైనా పర్యటనకు వచ్చింది అసలు పుతిన్ కానేకాదని… అతడిలా ఉన్న మరో వ్యక్తి మాత్రమేనని తెలిపింది. ఇలా అనేక సార్లు పుతిన్‌కు ప్రతికూలంగా ఉండే వార్తలనే ప్రచురిస్తూ వస్తోంది.