Covid 19 | మళ్లీ కరోనా అలజడి.. మాస్కులు ధరించాలని ఆదేశం
Covid 19 | ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి మరోసారి అలజడి సృష్టిస్తోంది. సింగపూర్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో 25,900 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Covid 19 | సింగపూర్ : ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి మరోసారి అలజడి సృష్టిస్తోంది. సింగపూర్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో 25,900 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారానికి వారానికి కేసులు రెట్టింపు అవుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, కరోనాను కట్టడి చేయాలని ఆదేశించింది.
గత వారంతో పోలిస్తే ఈ వారం 90 శాతం కేసులు పెరిగినట్లు ఆరోగ్య శాఖ మత్రి ఆంగ్ యు కుంగ్ తెలిపారు. గత వారం 181 మంది కరోనాతో ఆస్పత్రిలో చేరితే ఆ సంఖ్య ఈ వారంలో 250కి చేరుకుందన్నారు. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ నాటికి కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పౌరుడు మాస్కు ధరించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కరోనాను కట్టడి చేయాలని కోరారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు పడకలతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. అత్యవసరం కాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని సూచించారు. కరోనా రోగులకు సంబంధించిన కిట్లను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, వచ్చినా కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని ఆంగ్ యు కుంగ్ పేర్కొన్నారు.