Donald Trump | ఆ తీర్పును నిలిపివేయండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్‌ యంత్రాంగం..

ఫెడరల్ కోర్ట్ వ్యవస్థ నుంచి ట్రంప్ పాలనాయంత్రాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. జన్మతః పౌరసత్వంలో మార్పులు, ఫెడరల్ ఖర్చులు, ట్రాన్స్‌జెండర్ల హక్కులు సహా అనేక అంశాల్లో ట్రంప్ యంత్రానికి వ్యతిరేకంగా ఫెడరల్ జడ్జీలు 30కిపైగానే తీర్పులు వెలువరించాయి.

Donald Trump | ఆ తీర్పును నిలిపివేయండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్‌ యంత్రాంగం..

Donald Trump । ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించేందుకు చేపట్టిన మూకుమ్మడి తొలగింపులకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సోమవారం ఆ దేశ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు ఎమర్జెన్సీ అప్పీలును దాఖలు చేసింది. 16 వేల మందికిపైగా ప్రొబేషనరీ ఉద్యోగులను పునర్నియమించాలని ఒక జడ్జి కార్యనిర్వహక విభాగాన్ని ఒత్తిడి చేయజాలడని అందులో పేర్కొన్నది. ఈ విషయంలో గతంలో తీర్పు చెప్పిన కాలిఫోర్నియాకు చెందిన జడ్జి.. ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపులు ఫెరడల్ చట్టాలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ వారి పునర్నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అప్పీలుకు వెళ్లిన అధికార యంత్రాంగం.. ట్రంప్ తీసుకుంటున్న చర్యల వేగాన్ని తగ్గించేలా అనేక మంది ఫెడరల్ జడ్జిలు ప్రయత్నిస్తున్నారని, వారిని సుప్రీంకోర్టు కట్టడి చేయాలని కూడా అప్పీలులో విజ్ఞప్తి చేశారు. శాఖల మధ్య అధికారాల ఆక్రమణకు ఈ కోర్టు మాత్రమే ముగింపు పలకగలదని అందులో పేర్కొన్నారు. ఫెడరల్ కోర్ట్ వ్యవస్థ నుంచి ట్రంప్ పాలనాయంత్రాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. జన్మతః పౌరసత్వంలో మార్పులు, ఫెడరల్ ఖర్చులు, ట్రాన్స్‌జెండర్ల హక్కులు సహా అనేక అంశాల్లో ట్రంప్ యంత్రానికి వ్యతిరేకంగా ఫెడరల్ జడ్జీలు 30కిపైగానే తీర్పులు వెలువరించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదం ఫెడరల్ ప్రభుత్వాన్ని కుదించే ట్రంప్ ప్రయత్నాలకు సవాలుగా నిలిచింది. సుప్రీం కోర్టు నిర్ణయం ఈ కేసులో కీలక పాత్ర పోషించనుంది. ఇది అమెరికా రాజకీయ, పరిపాలనా వాతావరణంపై రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు.