RIP British Farming । బ్రిటన్‌లో అన్నదాతల ఆగ్రహం.. లండన్‌ నగరంలోకి వందల సంఖ్యలో ట్రాక్టర్లు..

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం సాగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పంజాబ్‌, హర్యానా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య స్పెయిన్‌లో రైతులు రోడ్లెక్కారు. తాజాగా బ్రిటన్‌లో అన్నదాతలు లండన్‌ నగరంలోకి ట్రాక్టర్లతో ప్రవేశించారు. బ్రిటిష్‌ వ్యవసాయాన్ని కాపాడండంటూ నినదిస్తున్నారు.

RIP British Farming । బ్రిటన్‌లో అన్నదాతల ఆగ్రహం.. లండన్‌ నగరంలోకి వందల సంఖ్యలో ట్రాక్టర్లు..

RIP British Farming । మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ఆందోళన, ఇప్పటికీ శంభు సరిహద్దు వద్ద కొనసాగిస్తున్న పోరాటం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో స్పెయిన్‌ రైతులు కూడా ఇదే తరహా ఆందోళనకు దిగారు. ఐరోపా యూనియన్‌ ఉమ్మడి వ్యవసాయ విధానంలో బ్యూరోక్రసీ జోక్యాన్ని తగ్గించాలని, పర్యావరణ నిబంధనలను సడలించాలని డిమాండ్‌ చేస్తూ మాడ్రిడ్‌ నగరంలోకి ట్రాక్టర్లతో వచ్చి ఆందోళనకు దిగారు. ఇప్పుడు తాజాగా బ్రిటన్‌లో సైతం అన్నదాతలు కన్నెర్ర చేశారు. సేవ్‌ బ్రిటిష్‌ ఫార్మింగ్‌ (SBF) పేరుతో సంఘటితమైన రైతులు.. లండన్‌ నగరంలోకి ట్రాక్టర్లను కదిలించారు. బ్రిటన్‌లో అతి సంపన్నులు వారసత్వ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు భూములు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని నివారించే పేరిట బ్రిటన్‌ ప్రభుత్వం పది లక్షల పౌండ్లకు మించి ఖరీదైన భూములు ఉంటే 20 శాతం వారసత్వ పన్ను విధించేందుకు ఆలోచన చేస్తున్నది. అయితే.. ఈ చర్య వల్ల చిన్న కుటుంబ ఫామ్స్‌ కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లపై లండన్‌ వీధుల్లోకి వచ్చారు. అధికార లేబర్‌ పార్టీ అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన చర్యలకు నిరసనగా జరుగుతున్న ఈ ఆందోళనలను ‘సెకండ్‌ వెస్ట్‌మినిస్టర్‌ ర్యాలీ’, ‘ఆర్‌ఐపీ బ్రిటిష్‌ ఫార్మింగ్‌ పేరిట పిలుస్తున్నారు.


ఆహార భద్రత పెంపు, వ్యవసాయ రంగంలో ప్రజలు నిమగ్నం అయ్యే ఉద్దేశంతో కుటుంబాల ఆధ్వర్యంలో ఉన్న వ్యవసాయ భూములకు పన్ను మినహాయింపు 1992 నుంచి కొనసాగుతున్నదని ది గార్డియన్‌ పేర్కొంటున్నది. తద్వారా జీవనోపాధికి ఇతర లాభదాయకమైన మార్గాలు ఎంచుకోకుండా వ్యవసాయంపై ప్రజలు కేంద్రీకరించేందుకు దీనిని ఉద్దేశించారు. ప్రస్తుతం యూకేలో ఆహార అవసరాలకన్నా 60 శాతం తక్కువ వ్యవసాయోత్పత్తులు వస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బ్రిటన్‌ ప్రభుత్వం వివాదాస్పదన ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం.. మొదటి పది లక్షల పౌండ్ల లోపు విలువైన ఉమ్మడి వ్యవసాయ, వ్యాపార ఆస్తుల వరకూ వందశాతం వారసత్వ పన్ను మినహాయింపు పరిమితం చేస్తారు. ఆపైన ఉన్న వ్యవసాయ భూములు, వ్యాపార ఆస్తులపై 20శాతం వారసత్వ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2026 నుంచి ఈ పన్ను 40 శాతం వరకూ ఉండనున్నది. దానిని 20 శాతానికి పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదనపై బ్రిటన్‌ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.