ప్రళయకాల విమానం వాషింగ్టన్​లో ప్రత్యక్షం – ఏం జరుగబోతోంది?

డూమ్స్​డే ప్లేన్​, అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే బయటకి వచ్చే అమెరికన్​ వాయుసేన విమానం. ప్రస్తుతం రాజధాని వాషింగ్టన్​లో ప్రత్యక్షమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రక్షణరంగ నిపుణులు ఉలిక్కిపడుతున్నారు. ఇది రాజధానిలో దిగిందంటే ఏదో పెద్దదే జరుగబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహించినట్లే అమెరికా ఇరాన్​ అణుకేంద్రాలపై దాడి చేసింది. ఇక ఇరాన్​ వంతొచ్చింది.

ప్రళయకాల విమానం వాషింగ్టన్​లో ప్రత్యక్షం – ఏం జరుగబోతోంది?

 

 

డూమ్స్​డే ప్లేన్(Doomsday Plane)​ లేదా ఫ్లయింగ్​ పెంటగాన్​గా వ్యవహరించబడే భారీ విమానం అమెరికా రాజధాని వాషింగ్టన్​లో దిగింది. ఈ–4బి నైట్​వాచ్​(E-4B Nightwatch) గా వ్యవహరించబడే బోయింగ్​ 747–200 రకానికి చెందిన ఆధునీకరించబడిన విమానమిది. గత మంగళవారం ఇది మేరీల్యాండ్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​లో దిగడం, అదీ ఇరాన్​తో ప్రెసిడెంట్​ ట్రంప్​ మాటల యుద్ధం తర్వాత కావడంతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇరాన్​పై దాడికి అమెరికా సన్నద్ధమవుతుందనడానికి ఇదే సంకేతమని పలువురు వాయుసేన మాజీ అధికారులు అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లే అమెరికా నేరుగా ఇరాన్​లో యుద్ధంలోకి దిగింది.

అసలు ఈ విమానం సంగతేంటి? దీన్ని బయటకు తీసుకురావడం యుద్ధానికి సంకేతమా? ఇరాన్​ హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్(Donald Trump)​ నిర్ణయం మేరకే ఈ డూమ్స్​డే ప్లేన్​ ప్రత్యక్షమైందా…? తెలుసుకుందాం.

డూమ్స్​డే అంటే ప్రళయపు రోజు. ఇక భూమిపై నుండి యుద్ధ సందేశాలు, ఆదేశాలు జారీచేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు అమెరికా అధికారగణం ఆకాశంలో ఉండి కూడా సమరసన్నాహాలకు సిద్ధంగా ఉండటానికే ఈ విమానం. సమర సమయంలో అమెరికా వైట్​హౌస్​ నుండి అధ్యక్షుడు, పెంటగాన్​ నుండి త్రివిధదళాల అధినేతలు(Joint Chiefs of Staff), రక్షణశాఖామంత్రి, ఇతర రక్షణరంగ ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటం భద్రతాకారణాల రీత్యా క్షేమం కాదనీ, వీటిపై శత్రుదేశం దాడి చేయొచ్చనే ఉద్దేశ్యంతో అటు అధ్యక్షుడికి ఎయిర్​ఫోర్స్​ వన్​, ఇటు పెంటగాన్​ ఉన్నతశ్రేణులకోసం డూమ్స్​డే ప్లేన్​లను ఉపయోగిస్తారు. అయితే ఎయిర్​ఫోర్స్​ వన్​ పూర్తిగా అధ్యక్షుడి ప్రయాణాల కోసమే ఉండగా, ఈ డూమ్స్​డే ప్లేన్​ మాత్రం కేవలం అత్యంత ప్రమాదకర యుద్ధ పరిస్థితుల్లోనే రక్షణశాఖామాత్యుడు, త్రివిధదళాధిపతులు, ఇతర అధికారులు యుద్ధక్షేత్రంలోని అధికారులకు నిరంతరం అందుబాటులో ఉండటం కోసం వీరిని తీసుకుని ఆకాశంలో విహరిస్తూఉంటుంది. అందుకే దీనికి ఫ్లైయింగ్​ పెంటగాన్​ అనే మరోపేరు కూడా ఉంది. అలాగే జాతీయ గగనతల కార్యకలపాల కేంద్రం(National Airborne Operations Centre)గా కూడా వ్యవహరిస్తుంది. ఇటువంటి విమానాలు అమెరికా వాయుసేన వద్ద నాలుగున్నాయి.

ఈ–4బి నైట్​వాచ్​ ప్రత్యేకతలేంటంటే, ఇది ఎటువంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకుంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత తరంగ తాకిడి(EMP), సైబర్​ దాడులు, అణ్వాయుధ దాడులు(Nuclear Attacks) కూడా ఈ విమానాన్ని ఏం చేయలేవు. వారంరోజుల పాటు ఎక్కడా దిగకుండా నిర్విరామంగా ఆకాశంలోనే సంచరించగలిగే సత్తా దీని సొంతం. గగనతలంలోనే ఇంధనం నింపుకోగలిగే సామర్థ్యం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశంతో కూడా సంభాషించగల కమ్యూనికేషన్​ సదుపాయాలు ఇది కలిగిఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా 67 డిష్​ ఆంటెన్నాలు ఏర్పాటు చేసారు. అధ్యక్షుడి ఎయిర్​ఫోర్స్​ వన్​తో నిరంతర  సమాచార సంబంధం కలిగిఉంటుంది. ఆయన కూడా దాదాపు ఇదే విమానంలో ఉన్నంత దగ్గరితనం రెండు విమానాల మధ్య ఉంటుంది. మరీ పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు అధ్యక్షుడిని కూడా ఇందులోకి తరలిస్తారు. అత్యంత అవసర పరిస్థితిలో ఇది యుద్ధ విమాన అవతారం కూడా ఎత్తగలదు. భారీ క్షిపణులకు ప్రయోగించగల సామర్థ్యం, గగనతల యుద్ధం చేయగల సన్నద్ధత దీని ప్రత్యేకత.

 

ఈ విమానం మూడు విభాగాలుగా ఉంటుంది. సిబ్బంది కోసం 18 మంచాలు, యుద్ధ చర్చలకై ఓ వార్​రూమ్​, ఒక పూర్తి కంట్రోల్​ కమాండ్​ సెంటర్​, విశ్రాంతి గదులు ఉంటాయి. ఈ విమానంలో ఉండే 112మంది సిబ్బంది అన్ని రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. పెంటగాన్​లో ఏ రకమైన అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలుంటాయో, అవన్నీ దీన్లో కూడా ఉంటాయి. అందుకే దీనికి ఫ్లైయింగ్​ పెంటగాన్​ అని పేరొచ్చింది.

సాధారణంగా ఈ విమానం జనబాహుళ్యంలో కనబడిందంటే, ఎక్కడో, ఏదో పెద్ద ఉపద్రవం రాబోతోందని అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్​ బేషరతుగా లొంగిపోవాలనే ట్రంప్​ హెచ్చరిక, దానికి ప్రతిగా ఇరాన్​ అధినేత అలీ ఖమేనీ తిరిగి అమెరికాకు వార్నింగ్​ ఇవ్వడం నేపథ్యంలో అమెరికా ఇరాన్​పై యుద్ధం మొదలుపెట్టనుందనే వార్తలకు డూమ్స్​డే ప్లేన్​ రాజధానిలో సిద్ధంగా ఉండటం ఊతమిస్తోంది. దాడుల తర్వాత ఇరాన్​ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో దీని అవసరం పడే అవకాశముంది.

అధ్యక్షుడు సాధారణంగా ప్రయాణించే ఎయిర్​ఫోర్స్​ వన్​లో కూడా సకల సౌకర్యాలున్నప్పటికీ, ఫ్లయింగ్​ పెంటగాన్​లో ఉండే స్థాయి రక్షణ ఏర్పాట్లు ఉండవు. అన్నీ ఉంటాయి కానీ, మధ్యస్థంగా ఉంటాయి. ఈ–4బిలో ఉన్నన్ని మిలిటరీ సౌకర్యాలు, ఉన్నతస్థాయి రక్షణ సౌలభ్యాలు ఎయిర్​ఫోర్స్​ వన్​లో ఉండవు. ఇది చాలా ఆడంబరంగా, అత్యంత అధునికమైన సకల సౌకర్యాలతో ఉంటుంది. ముఖ్యంగా ఇది కేవలం అధ్యక్షుడికి ఉండాల్సిన సౌకర్యాలపైనే ఎక్కువగా ఫోకస్​ చేయబడి ఉంటుంది.  నిజానికి ఎయిర్​ఫోర్స్​ వన్​ అనేది అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం తాలూకు కాల్​సైన్​. ఎయిర్​ ఫోర్స్​లో ప్రతీ విమానానికీ ఓ కాల్​సైన్​ ఉంటుంది. అంటే గుర్తు అన్నమాట. ఈ కాల్​సైన్​తోనే ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ విమానాన్ని గుర్తుంచుకుంటారు. డూమ్స్​డే విమానానికి కూడా కాల్​సైన్​ ఉంది. అది నైట్​వాచ్(nightwatch)​. అయితే పరిస్థితులను బట్టి ఈ కాల్​సైన్(Call sign)​ మారుతుంది. ఒకవేళ అధ్యక్షుడు కూడా అందులోనే ఉంటే అప్పుడది ఎయిర్​ఫోర్స్​ వన్​ అవుతుంది. న్యూక్లియర్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​గా ఉన్నప్పుడు లుకింగ్​ గ్లాస్(looking glass)​గా వ్యవహరిస్తారు.

సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే భారీ ఎయిర్​ఫోర్స్​ వన్​ విమానాన్ని చాలామంది సినిమాల్లో, ఫోటోల్లో చూసేఉంటారు. ఇది కూడా బోయింగ్​ 747‌‌–200బి రకానికి చెందిందే. దీన్ని కూడా అధ్యక్షుడి ప్రయాణానికి వీలుగా ఆధుకరించారు. అయితే అదే కాదు, అధ్యక్షుడు ఏ విమానంలో ఉంటే అది వెంటనే ఎయిర్​ఫోర్స్​ వన్​గా మారిపోతుంది. అంటే ఆ విమానం కాల్​సైన్​ వెంటనే ఎయిర్​ఫోర్స్​ వన్ అవుతుంది. రెగ్యులర్​గా ప్రెసిడెంట్​ వాడే విమానంలో ఆయన లేకపోతే దాన్ని ఎయిర్​ఫోర్స్​ వన్​ అనకూడదు.