Revanth Redy Vs Kishan Reddy: కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో.. రేవంత్ వ్యూహమేంటీ?

- సైంధవ పాత్ర అంటూ ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు
- కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ఆగ్రహం
- మోడీ చేస్తామన్నా.. కేంద్ర మంత్రి ఎందుకు అభ్యంతరం
- ఆకస్మికంగా తీవ్ర విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్
- రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఆసక్తికరమైన చర్చ
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకస్మికంగా తన పొలిటికల్ టార్గెట్ ను మార్చారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)ని టార్గెట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సీఎం ఏం మాట్లాడినా ‘కిషన్ రెడ్డి పై ఘాటు విమర్శలు’ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నూతన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, బడ్జెట్ తో పాటు ఇతర శాఖలకు అవసరమైన నిధులు కేటాయించ కుండా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ నిప్పులు చెరుగుతున్నారు. చిత్రమైన అంశమేమిటంటే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు లు, నిధుల విషయంలో ప్రధాని మోడీ ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా.. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండి పడుతున్నారు. ఇందులో కూడా బీజేపీని విమర్శించకుండా కేవలం కిషన్ రెడ్డిని మాత్రమే రేవంత్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. రేవంత్ లో వచ్చిన ఈ తాజా మార్పు వెనుక ఉన్న మతలబేమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సీఎం నిప్పులు
రాష్ట్రంలో మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు తదితర వాటిని కేంద్ర కేబినేట్ లో చర్చకు రాకుండా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి అభ్యంతరాలు చెబుతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ఎక్కడ ముఖ్యమంత్రిగా తనకు మంచి పేరొస్తుందననే అక్కసుతో కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహాన్ని కనబరుస్తున్నారు. గత ఆరేళ్ళుగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి తెచ్చిన ఒక్క నూతన ప్రాజెక్టు చెప్పాలనీ, ఎప్పుడైనా ఫలనా ప్రాజెక్టు రాష్ట్రానికి అవసరమంటూ ప్రధానిని కలిసిన సందర్భం ఉందా? అంటూ సవాల్ విసురుతున్నారు. ఒక దశలో తన చీకటి పార్ట్నర్, మాజీ సీఎం కేసీఆర్ చెప్పుచేతుల్లో కిషన్ రెడ్డి కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మిత్రుడు కేసీఆర్ ఏం అభివృద్ది చేయలేదు గనుక తాను చేస్తే పేరొస్తొందనే బాధతో అడ్డుకుంటున్నారని విమర్శించడం గమనార్హం. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం నుంచి తాము పెట్టిన ప్రధాన ప్రాజెక్టులకు అనుమతులు, అవసరమైన నిధులు సాధించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిదే అంటూ స్పష్టం చేశారు.
టార్గెట్ మార్పులో మతలబేమిటీ?
నిన్నటి వరకు ఏ విషయం వచ్చినా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ ఎస్ ఆ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రేవంత్ రెడ్డి విమర్శించేది. అప్పుడప్పుడు బీజేపీ, మోడీపై విమర్శలు చేసేవారు. కానీ, నెల రోజులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో మతలబేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటే కిషన్ రెడ్డి పై బహిరంగ ఒత్తిడిని ప్రారంభించారా? లేదా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని చెప్పాలనుకుంటున్నారా? కిషన్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య ‘బంధం’ ఉందని ప్రజల్లో బహిరంగపరచి, ఆయనను ఒంటరి చేయాలనుకుంటున్నారా? ఇదిలాఉండగా కేంద్ర మంత్రి వర్గ ఏజెండాలోకి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ చెబుతున్నారంటే బీజేపీ నుంచి రేవంత్ కు ఉప్పందిందా? అంటున్నారు.
సీఎం రేవంత్ టార్గెట్ మార్చారా?
రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఏడాదిన్నర పాలనా అనుభవాల నేపథ్యంలో మొన్నటి వరకు అనుసరించిన విమర్శల లక్ష్యం, వ్యూహాన్ని రేవంత్ రెడ్డి మార్చారా? ప్రధాన ప్రతిపక్ష పార్టి బీఆరెఎస్ ను పక్కనపెట్టి కిషన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారా? దీనికి ప్రత్యేక కారణాలున్నాయా? అనే సందేహాలు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ ఒక్క స్థానం దక్కించుకోలేదు. నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. పది మంది ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. తాజా కరీంనగర్, నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పై పెరిగిన వ్యతిరేకత సైతం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారకపోవడం గమనించారా? ఆ పార్టీ నిర్మాణాత్మక సమస్యలతో పాటు విశ్వనీయతను ఎదుర్కొంటుందనే అభిప్రాయానికి వచ్చారా? మునిగిపోయే పడవ గురించి మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చారా? ఈ కారణంగానే ఆ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత తగ్గిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది.
కిషన్ రెడ్డి పై విమర్శలు వ్యూహాత్మకమా?
రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ, ఎనిమిది లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది. అన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తూ భారీ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పును గుర్తించిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఆ పార్టిని, మంత్రిని ప్రజల్లో బహిరంగం చేయవచ్చనే ల-క్ష్యం ఉందా? అని అనుమానిస్తున్నారు. అందుకే కిషన్ రెడ్డిని ఇరుకున పెడుతున్నారంటున్నారు. రేవంత్ విమర్శల పై అటు బీజేపీ వర్గాల్లోనూ చర్చసాగుతోంది. దీనిని గుర్తించే కిషన్ రెడ్డి రేవంత్ పై ప్రతి విమర్శలను ఘాటుగా చేస్తున్నారంటున్నారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకరాకుండా బీజేపీ నేతలు ఎన్నిచెప్పినా విశ్వనీయతపొందలేరనేది వాస్తవం.
(రవి సంగోజు)